Business

ఆర్థిక సంక్షోభంలో పాక్ అద్దెకు కరాచీ పోర్టు

ఆర్థిక సంక్షోభంలో పాక్ అద్దెకు కరాచీ పోర్టు

పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుగుతోంది. ఐఎంఎఫ్‌ (IMF) నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థికసాయం అందకపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చరాస్తులు విక్రయించడం, అద్దెకివ్వడం ద్వారా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ప్రధాన ఓడరేవును యూఏఈ (UAE)కి చెందిన సంస్థకు అద్దెకు ఇచ్చింది. ఈ మేరకు యూఏఈకీ చెందిన ఏడీ పోర్ట్‌ గ్రూప్‌తో కరాచీ పోర్ట్‌ ట్రస్ట్‌ (KPT) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 220 మిలియన్‌ డాలర్లు. దీంతో పాక్‌ ఆర్థిక కష్టాలు కొంత వరకు తీరనున్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న పాక్‌కు ఈ ఒప్పందం ద్వారా కొంత ఊరట లభించనుంది. ఏడీ పోర్ట్స్‌ గ్రూప్‌.. యూఏఈకి చెందిన మరో సంస్థ ఖహీల్‌ టెర్మినల్‌తో కలిసి 50 ఏళ్లపాటు కరాచీ పోర్టు నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. పాకిస్థాన్‌లో ఉన్న ఓడ రేవుల్లో కరాచీ పోర్టు అత్యంత రద్దీగా ఉండే పోర్టు. తాజా ఒప్పందంలో భాగంగా రాబోయే పదేళ్లలో కరాచీ పోర్టులో ఏడీ గ్రూప్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు గ్రాంట్‌లు, రుణాలు, ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో యూఏఈ ప్రధాన సహకారం అందిస్తోంది.