Politics

ఏపీ, తెలంగాణల్లో పరిస్థితి తారుమారైందని కేసీఆర్ కామెంట్స్

ఏపీ, తెలంగాణల్లో పరిస్థితి తారుమారైందని కేసీఆర్ కామెంట్స్

తెలంగాణలో భూముల విలువపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భూముల విలువ పెరిగిందని చంద్రబాబే చెప్పారని గుర్తు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం అమ్మితే.. తెలంగాణలో ఐదు నుంచి ఆరు ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాల భూమిని కొనుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉటంకించారు. పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాని కేసీఆర్ చెప్పారు. మంచి నాయకత్వం.. మంచి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో.. భూముల ధరలు ఎలా పెరుగుతాయో.. కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పటాన్‌చెరులో ఎకరం ధర 30 కోట్లు ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పినట్టు పేర్కొన్నారు. ఇలా అయితే… తెలంగాణలో ఎకరం అమ్ముకుని నిజంగానే చంద్రబాబు ఆంధ్రాలో 100 ఎకరాలు కొనుక్కోవచ్చని సరదా వ్యాఖ్యలు చేశారు. పటాన్‌చెరులో అప్పటికీ ఇప్పటికీ భూముల విలువ చాలా వరకు పెరిగిపోయిందంటూ కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే.. పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్.. నియోజకవర్గంలో వరాల జల్లు కురిపించారు. పటాన్‌చెరులో రోజురోజుకు జనాభా పెరిగిపోతుందని.. అందుకే పటాన్ చెరును రెవెన్యూ డివిజన్ చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరుతున్నట్టు తెలిపిన కేసీఆర్.. దాన్ని మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. మరోసారి మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. పటాన్ చెరు వరకు మెట్రో విస్తరిస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పటాన్ చెరులోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధికి తలా ఓ 10 కోట్ల నిధురు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.