* తిరుమల సర్వదర్శనానికి 18గంటల సమయం
AP: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,120 మంది భక్తులు దర్శించుకోగా.. 34,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.39కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
* కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం
కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇప్పుడు ఆ పార్టీకి వరంలా మారింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తి స్కీమ్ కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్ హిందూ కార్డుగా కూడా మారింది. ఈ పథకం టెంపుల్ టూరిజంను ప్రోత్సహిస్తోంది. జూన్ 11న శక్తి స్కీమ్ పథకం ప్రారంభమైనప్పటి నుండి కోట్లాది మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించారు. వచ్చే ఎన్నికల్లో ఇది తమకు ఓటు బ్యాంకుగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పథకం తర్వాత మహిళల నుండి వస్తున్న ఆదరణ పట్ల కాంగ్రెస్ ఆనందంగా ఉంది. అయితే ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.4,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది.
* తెలంగాణకు రాగల 3 రోజుల్లో వర్ష సూచన
TS: రాగల 3 రోజుల్లో తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఇవాళ కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, WGL, హన్మకొండ, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
* నేడు అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం
నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిచనున్నారు. అంబేద్కర్ విగ్రహం నుండి 6 వేల మంది కళాకారులతో స్మారక చిహ్నం వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. అమరవీరులకు గన్ సెల్యూట్ అనంతరం సీఎం కేసీఆర్ అమరజ్యోతిని ప్రారంభిస్తారు. ఈ సభలో 10 వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. 800 డ్రోన్లు, లేజర్ తో షో నిర్వహిస్తారు.
* భట్టి విక్రమార్కతో పొంగులేటి భేటీ
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన భట్టిని పొంగులేటి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరిపారు. త్వరలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
* నేడు తెలంగాణలో హరితోత్సవం..అన్ని పార్కుల్లోకి ఎంట్రీ ఉచితం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇవాళ హరితోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా… ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు అధికారులు.ఈ క్రమంలోనే… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్కుల్లో ప్రజలకు ఉచిత ప్రవేశ అనుమతి ఇవ్వాలి. పార్కులను సందర్శించేలా ప్రజలను ప్రోత్సహించాలి’ అని సిఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు.
* శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తాం: తితిదే ఈవో
శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో పీఠాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై వస్తోన్న ఆరోపణలను ఈ సందర్భంగా పీఠాధిపతులు, స్వామీజీలు ఖండించారు. ఆ నిధులు సద్వినియోగమవుతున్నాయని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పలు ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణను తితిదే చేపట్టిందన్నారు. అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్‌కు ఆన్లైన్ ద్వారా రూ.475.57 కోట్లు, ఆఫ్‌లైన్ ద్వారా రూ.350.82 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అమరావతిలో రూ.150కోట్లతో ఆలయం నిర్మించామని చెప్పారు
* పాక్ యూనివర్శిటీల్లో హోలీ నిషేధం..కారణం ఇదే ?
ఇస్లామిక్ గుర్తింపును కాపాడేందుకు దేశంలోని విద్యాసంస్థల్లో హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకోవడాన్ని పాకిస్థాన్ నిషేధించింది. దీని వల్ల తమ ఇస్లామిక్ గుర్తింపు ప్రమాదంలో పడుతుందని పాకిస్థాన్ భయపడుతోంది. హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకునే అనేక వీడియోలు పాకిస్తాన్లో వెలువడ్డాయి. ఇప్పుడు పాకిస్థాన్ విద్యా శాఖ ఈ కఠిన చర్య తీసుకుంది. తమ విశ్వాసం ఇస్లాం మతంపై మాత్రమే ఉందని, మైనారిటీలపై తమ దౌర్జన్యాలు కొనసాగుతాయని పాకిస్థాన్ మరోసారి రుజువు చేసింది. హిందూ, సిక్కు జనాభాకు వ్యతిరేకంగా ఇది పెద్ద చర్యగా పరిగణించబడుతుంది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోని ఉన్నత విద్యా కమిషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మన సామాజిక-సాంస్కృతిక విలువలకు, దేశ ఇస్లామిక్ గుర్తింపుకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను చూడడం బాధాకరమని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇస్లామాబాద్ క్యాంపస్‌లో పాకిస్తాన్‌లోని క్వాయిడ్-ఎ-అజామ్ విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలు రంగులు అద్దుకుని కనిపించారు. ఇలాంటి వీడియోలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పాకిస్థాన్ కమిషన్ పేర్కొంది. ప్రజలు అధికంగా పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఈ తాలిబాన్ డిక్రీపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్లో మతపరమైన హింసకు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పాకిస్థాన్ తుగ్లక్ ఉత్తర్వు మానవ హక్కుల సంస్థలను మరోసారి ఆందోళనకు గురి చేసింది.
* ఏపీ, తెలంగాణల్లో పరిస్థితి తారుమారైందని కేసీఆర్ కామెంట్స్
తెలంగాణలో భూముల విలువపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భూముల విలువ పెరిగిందని చంద్రబాబే చెప్పారని గుర్తు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం అమ్మితే.. తెలంగాణలో ఐదు నుంచి ఆరు ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాల భూమిని కొనుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉటంకించారు. పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాని కేసీఆర్ చెప్పారు
* త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటాం: కేటీఆర్
భారతదేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకం.. జ్వలించే దీపం సాక్షిగా త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితం అవుతామన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన నేడు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని కేటీఆర్ ట్వీట్ చేశారు