ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందుగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్.. ఆ జట్టును వీడనున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. కొత్త జట్టుకు మారాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన గిల్.. 17 ఇన్నింగ్స్‌లలో 890 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాదు గిల్‌కే ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఈ సీజన్‌లో గిల్.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. త్వరలోనే టీమిండియాకు ఓ ఫార్మాట్‌కు కెప్టెన్ అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని ఇప్పటకే పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గిల్ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందుగా సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌బై చెప్పి.. కొత్త జట్టుకు సారధిగా వెళ్లాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అరంగేట్ర సీజన్‌తో గుజరాత్‌కు ట్రోఫీ అందించి.. ఈ ఏడాది జట్టును ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా.. మరో ఐదారేళ్లు కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. దీంతో శుభ్‌మాన్ గిల్‌కి గుజరాత్ సారధ్య బాధ్యతలు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే గుజరాత్ జట్టు వీడిపోయి.. కొత్త జట్టుకు కెప్టెన్ అవ్వాలని గిల్ భావిస్తున్నాడట. సొంత రాష్ట్రమైన పంజాబ్ కింగ్స్ లేదా సరైన కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్‌కు ఆడాలని అతడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఒకవేళ ఇదే జరిగితే.. గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద నష్టం వాటిల్లినట్లే. టాప్ ఆర్డర్‌లో కీలక బ్యాటర్‌ను ఆ జట్టు కోల్పోయినట్లే.