NRI-NRT

బైడెన్ దంపతులకు మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే

బైడెన్ దంపతులకు మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులకు ప్రత్యేక కానుకలు అందించారు. వారితో కలిసి వైట్‌హౌస్‌లో విందులో పాల్గొన్నారు. బైడెన్‌తో భేటీ అయ్యారు. మోదీకి 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలీ, పురాతన అమెరికన్ కెమెరాను బైడెన్‌ కానుకగా ఇచ్చారు.ఇక జో బైడెన్‌కి మోదీ కూడా విలువైన బహుమానాలు అందించారు. జైపూర్‌కు చెందిన కళాకారుడి చేత ప్రత్యేకంగా తయారు చేయించిన గంధపు పెట్టెను ఇచ్చారు. దానిలోపల వినాయకుడి విగ్రహాన్ని పెట్టి బైడెన్‌ దంపతులకు అందించారు. గంధపు పెట్టెపై రాజస్థాన్‌ పురాతన కళాత్మక, అద్భుతమైన నగిషీలు చెక్కి ఉన్నాయి. పెట్టె లోపల ఉన్న వెండి గణేశుడి విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన ఐదో తరం సిల్వర్‌స్మిత్‌ల కుటుంబంతో చేయించారు. వినాయకుడి విగ్రహంతోపాటు వెండి దీపం కూడా ఇచ్చారు.

ఇక అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ల్యాబ్ గ్రోన్ 7.5 క్యారెట్ గ్రీన్ డైమండ్ ను మోదీ బహూకరించారు. లండన్‌కు చెందిన ఫేబర్ అండ్ ఫేబర్ లిమిటెడ్ ప్రచురించిన, యూనివర్శిటీ ప్రెస్ గ్లాస్గోలో ముద్రించిన ది టెన్ ప్రిన్సిపల్ అనే పుస్తకం మొదటి ముద్రణ కాపీని బైడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.జో బైడెన్‌కు మోదీ బహుమతిగా ఇచ్చిన పెట్టెలో 10 విరాళాలు ఉన్నాయి. గోదానం కోసం పశ్చిమ బంగాల్‌లోని నైపుణ్యం కలిగిన కళాకారులచేత సున్నితంగా చేతితో తయారు చేసిన వెండి కొబ్బరికాయను సమర్పించారు. భూదానం కోసం మైసూర్ నుంచి సేకరించిన సువాసనగల గంధపు చెక్కను ఇచ్చారు. తమిళనాడు నుంచి తెచ్చిన తెల్లనువ్వులను అందించారు. బంగారం దానం కోసం రాజస్థాన్‌ కళాకారుల చేత తయారు చేయించిన 24 క్యారెట్ల బంగారు నాణెంను అందించారు. అలాగే వెండినాణెంను కూడా ఇచ్చారు. గుజరాత్‌ నుంచి సేకరించిన ఉప్పు, మహారాష్ట్ర బెల్లాన్ని ఆ పెట్టెలో ఉంచారు.