కంప్యూటర్ స్టోరేజీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ‘సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్’ను గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు రూ.2.75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,550 కోట్లు) పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఇందులో మైక్రాన్ సొంతంగా 825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్నాయి.
స్థానికంగా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ (తయారీ, వ్యాల్యూ చైన్) ఏర్పాటుకు భారత్ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నట్టు మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహరోత్రా పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక కస్టమర్లకు సేవలు అందించడంతోపాటు, అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యం పెరుగుతుందని ప్రకటించారు.
సర్కారు నుంచి భారీ సాయం మైక్రాన్ ప్లాంట్‌కు కేంద్ర సర్కారు ‘మోడిఫైడ్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)’ పథకం కింద ఆమోదం లభించడం గమనార్హం. ఈ పథకం కింద మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50% కేంద్ర సర్కారు నుంచి లభిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో 20% మేర ప్రోత్సాహకాల రూపంలో గుజరాత్ సర్కారు అందిస్తుంది. మైక్రాన్ తన వంతు 30% వెచ్చిస్తే సరిపోతుంది.
దశలవారీగా..గుజరాత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ ప్లాంట్ దశల వారీగా కార్యకలాపాలు చేపట్టనుంది. ‘‘తొలి దశ నిర్మాణం ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. ఇందులో 5 లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్ స్పేస్ ఉంటుంది. 2024 చివరికి కార్యకలాపాలు మొదలవుతాయి’’అని మైక్రాన్ ప్రకటించింది. ఈ ప్లాంట్‌తో 5,000 మందికి ప్రత్యక్షంగా, 15,000 మందికి పరోక్షంగా వచ్చే కొన్నేళ్లలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఫేస్ 2 నిర్మాణం ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో ఉంటుందని పేర్కొంది.
సెమీకండక్టర్ రంగానికి ఊతం మైక్రాన్ ఏర్పాటు చేయబోయే సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్ట్ ప్లాంట్ భారత సెమీకండక్టర్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వేలాది హైటెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వర్థిల్లడానికి ఈ పెట్టుబడి కీలక పునాది అవుతుంది.
అవకాశాల కోసం చూస్తున్నాం..భారత్‌లో గొప్ప అవకాశాల కోసం చూస్తున్నాం. మెమొరీ, స్టోరేజీలో మైక్రాన్ ప్రపంచ దిగ్గజంగా ఉంది. డేటా సెంటర్లు, స్మార్ట్‌ఫోన్లు, పీసీలకు మేము కీలక సరఫరాదారుగా ఉన్నాం.