చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 72% వరకు వెనక్కి వచ్చేశాయని సమాచారం. ఆర్థిక వ్యవస్థలోని రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే 19న ప్రకటించిన సంగతి విదితమే. వీటిని సెప్టెంబరు 30లోగా వేరే నోట్లలోకి మార్చుకోవాలని లేదా బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని తెలిపింది. వీటి చెల్లుబాటును నిషేధించలేదు కనుక, రోజువారీ అవసరాలకూ వినియోగించుకోవచ్చంది. ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను కొందరు కొనుగోళ్లకు వినియోగిస్తుండగా, మరికొందరు బ్యాంకులకు వచ్చి, వేరే నోట్లలోకి మారుస్తున్నారు. మరికొందరు ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. వ్యాపారులు కూడా తమ వద్దకు వచ్చిన రూ.2000 నోట్లను బ్యాంకుల్లో జమచేస్తున్నారు. మొత్తంమీద చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 72% వరకు వచ్చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.