సమాజంలో నేటిికి ఆచారాలు అనగానే.. కొంత మంది గుడ్డిగా పాటిస్తూనే ఉంటారు. దానివల్ల ప్రయోజనమా లేక అది మూఢనమ్మకమా తెలుసుకోకున్నా పూర్వీకులు చేశారు కదా అని దాన్ని అనుసరిస్తూనే ఉంటారు. ఇంతకీ ఈ ఆచారం ఏంటి అంటారా. ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకోవడం. ఇదేం ఆచారం అని నోరెళ్ల బెడుతున్నారా. అసలు విషయం కూడా తెలుసుకోండి. అయితే ఇటీవలి కాలంలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే వీళ్లు ఒకరంటే ఒకరు ఇష్టం ఉండి.. సమాజం ఏం అనుకున్నా పర్లేదు మేం మాత్రం కలిసి జీవించాలని భావించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కర్ణాటకలోని ఓ ప్రాంతంలో మాత్రం ఇద్దరు అబ్బాయిలు అనాధిగా వస్తున్న ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నారు.
కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఈ అబ్బాయిల పెళ్లి జరిగింది. కృష్ణరాజ్‌పేట తాలూకాలోని ఓ గ్రామంలోని ప్రజలు శుక్రవారం రాత్రి ఇద్దరు అబ్బాయిలకు వివాహాం జరిపించారు. ఈ పెళ్లికి ఓ పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. ఆ గ్రామంలో వర్షాలు పడాలంటే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనే ఆచారం ఉందట. వాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ పెళ్లి చేసినట్లు గ్రామస్థులు వెల్లడించారు. వాన దేవతలను శాంతింపజేయడానికి, ఈ ప్రాంతంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ ఇద్దరు అబ్బాయిల వివాహంతో పాటు విందు కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ సమయానికి తమ గ్రామంలో వర్షాలు కురిశాయని.. ఈసారి మాత్రం ఇంకా వానలు పడకపోవడంతో గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు. వధూవరులుగా వివాహ వేడుకలో పాల్గొన్న ఇద్దరు అబ్బాయిలను చూసేందుకు స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ గ్రామానికి వచ్చారు. వర్షాలు పడాలని వానదేవుడిని ప్రార్థించడంతో కల్యాణోత్సవంలో భాగంగా గ్రామస్థులకు ప్రత్యేకంగా భోజనాలుకూడా ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని.. అందుకే గతేడాదితో పోలిస్తే ఇంకా వర్షాలు కురవలేదని అందుకే ప్రజలు పాత సంప్రదాయాలను ఆచరిస్తున్నారని స్థానికులు తెలిపారు.