దేశ రాజధాని దిల్లీ (Delhi)లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ రోడ్డుపై ఓ జంటను దోచుకునేందుకు వచ్చిన ఇద్దరు నిందితులు.. వారి పరిస్థితి చూసి తిరిగి వారికే రూ.100 ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీలు వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఓ జంటను తుపాకీతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి జేబులు తనిఖీ చేశారు. అయితే, వారి వద్ద కేవలం రూ.20 మాత్రమే ఉన్నాయి. ఆ మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు కూడా రోల్డ్ గోల్డ్‌వేనని గుర్తించారు. దీంతో వారే తిరిగి ఆ జంటకు రూ.100 ఇచ్చి అక్కడినుంచి ద్విచక్ర వాహనంపై జారుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు జీఎస్టీ అకౌంటెంట్ కాగా, మరొకరు ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ పలు ప్రాంతాల్లో ఈ విధమైన దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి తుపాకీ, ద్విచక్ర వాహనం, 30 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిని గుర్తించేందుకు 200కు పైగా సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.
వీరు దయ కలిగిన దొంగలు. దోపిడీకి ప్రయత్నించి ఎదురు డబ్బులిచ్చారు.
Related tags :