WorldWonders

విమానాశ్రయాలే లేని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా?

విమానాశ్రయాలే లేని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా?

| ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అన్నట్టుగా ఉన్న విమాన ప్రయాణం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో సుదూర ప్రాంతాల‌కు వెళ్లాలంటే చాలావ‌ర‌కు విమానాల‌నే ఆశ్రయిస్తున్నారు. ఒక దేశం నుంచి మ‌రో దేశానికి వెళ్లాలంటే ఎంచ‌క్కా ఎయిర్‌పోర్టుకు వెళ్లి విమానాల‌ను ఎక్కేస్తున్నారు.ఇంత‌లా విమాన ప్రయాణాలు ప్రాచుర్యం పొందిన ఈ స‌మ‌యంలోనూ కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టులు లేవు. న‌మ్మడానికి కాస్త విడ్డూరంగా అనిపించిన ఇది నిజం. పైగా ఎయిర్‌పోర్ట్‌లు లేని ఈ దేశాలు అన్నీ యూర‌ప్ ఖండంలోనే ఉండటం గమనార్హం.

* ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం వాటిక‌న్ సిటీ. చుట్టూ న‌లుదిక్కులా ఇట‌లీ దేశం వ్యాపించి ఉన్న వాటిక‌న్ సిటీకి.. ప్రత్యేకంగా అధినేత అంటూ ఎవ‌రూ ఉండ‌రు. క్రైస్తవ మ‌త గురువు పోప్ ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవ‌హ‌రిస్తారు. అక్కడ ఆయ‌న మాటే శాస‌నం. వెయ్యిలోపు జ‌నాభా ఉండే ఈ వాటిక‌న్ సిటీకి ఎయిర్‌పోర్టు లేదు.

*  వాటికన్‌ సిటీ వెళ్లాలంటే 20 కిలోమీట‌ర్ల దూరంలో రోమ్‌లో ఉన్న సియాంపినో ఎయిర్‌పోర్ట్‌, ఫిమిసినో ఎయిర్‌పోర్ట్‌లను ఆశ్రయించాల్సిందే. అక్కడి నుంచి వాటిక‌న్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లవ‌చ్చు.

*  ఫ్రాన్స్‌, స్పెయిన్ దేశాల మ‌ధ్యలో ఉన్న చిన్న దేశం అండొర్రా. కొండ‌లు, లోయ‌లు, ప్రకృతి అందాల‌తో ఇది ఎంతో ర‌మ‌ణీయంగా ఉంటుంది. ఇక్కడ 1982లో ఒక ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటైంది. కానీ 1984 నుంచి క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌కు ఇక్కడ అనుమ‌తి నిరాక‌రించారు. 2008 వ‌ర‌కు కూడా ప్రైవేటు విమానాల‌ను మాత్రమే అనుమ‌తించారు ఆ త‌ర్వాత మూత‌బ‌డిన ఈ ఎయిర్‌ఫీల్డ్‌.. 2010లో రీఓపెన్ అయింది.

*  అండొర్రాకు 2015 నుంచి టూరిస్ట్ చార్టెడ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమ‌తిస్తున్నారు. ఏదేమైనా సామాన్యులు వెళ్లాలంటే మాత్రం స్పెయిన్ లేదా ఫ్రాన్స్‌లోని ఎయిర్‌పోర్టులో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అండొర్రాకు వెళ్లాల్సి ఉంటుంది. స‌మీప ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లేందుకు క‌నీసం మూడు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

*  ఇటలీని ఆనుకుని ఉత్తరం వైపున శాన్ మారినో దేశం ఉంది. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒక‌టైన శాన్ మారినోలో దాదాపు 40 వేల మంది ప్రజ‌లు ఉన్నారు. ఈ దేశంలో కూడా విమానాశ్రయం లేదు.. ఇక్కడికి వెళ్లాలంటే ఇట‌లీలోని రిమిని లేదా బొలొగ్నా న‌గ‌రాల్లోని విమాన‌శ్రయాల‌కు వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శాన్ మారినోకు చేరుకోవాల్సి ఉంటుంది.

*  శాన్ మారినో దేశంలో ఎయిర్‌పోర్టు లేన‌ప్పటికీ అత్యవ‌స‌ర వినియోగానికి రెండు హెలీప్యాడ్‌లు ఉన్నాయి. బొర్గొమ‌గ్గియోర్‌లో ఒక హెలీప్యాడ్, టొర్రెసియాలో ఒక ఎయిర్‌ఫీల్డ్ ఉంది.

*  యూర‌ప్‌లోని అతి చిన్న దేశాల్లో మొనాకో కూడా ఒక‌టి. ఈ దేశానికి మూడు దిక్కుల ఫ్రాన్స్ దేశ‌మే ఉంటుంది. మిగిలిన ఒక‌వైపు అంటే.. ద‌క్షిణం వైపు మాత్రం మ‌ధ్యధ‌రా స‌ముద్రం ఉంటుంది. దాదాపు 40 వేల మంది జ‌నాభా ఉండే ఈ దేశానికి ఇప్పటివ‌ర‌కు ఎయిర్‌పోర్ట్ లేదు.

*  మొనాకోకు స‌మీపంలో ఫ్రాన్స్‌లోని నైస్ కొట్ డిఅజుర్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి 30 నిమిషాల్లో మొనాకోకు చేరుకోవ‌చ్చు.

*  ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల మ‌ధ్యలో ఉన్న అతి చిన్నదేశం లిచెన్‌స్టైన్. ప‌ర్యాట‌క ప్రాంతంగా ఫేమ‌స్ అయిన ఇక్కడ క‌నీసం ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేదు. ఇక్కడికి వెళ్లాలంటే పొరుగు దేశాలైన స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా ఎయిర్‌పోర్టుల‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది.

*  స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గాలెన్ – ఆల్టెన్రిన్ ఎయిర్‌పోర్టులో దిగి.. రోడ్డు మార్గంలో లేదా ప‌డ‌వ‌ల ద్వారా లిచెన్‌స్టైన్‌ చేరుకోవ‌చ్చు. లేదా ఆస్ట్రియా నుంచి రైలులో కూడా లిచెన్‌స్టైన్‌కు రావ‌చ్చు.