దేశంలో ఉన్నత విద్యనభ్యసించే వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో విద్యకు కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరిగింది. అందువల్ల మంచి పేరున్న కళాశాల, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. విద్యార్థులు కొత్త కొత్త కోర్సులను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగానే.. విద్యాసంస్థలు కూడా వినూత్న కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ఈ కొత్త కోర్సుల విద్యాభ్యాసానికి.. విద్యార్థుల నుంచి భారీగానే ఫీజులు చేస్తున్నాయి విద్యాసంస్థలు. ప్రతి సంవత్సరం విద్యా ద్రవ్యోల్బణం10-12 శాతం పైనే పెరుగుతూ వస్తోంది.
ఈ ఫీజుల మొత్తాన్ని కవర్ చేయాలంటే.. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్నీ వెచ్చించాల్సి వస్తోంది. కొన్నిసార్లు అవి కూడా సరిపోని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఈ ఖర్చులను భరించేందుకు.. విద్యార్థులు విద్యా రుణాన్ని ఎంచుకోవడం ఉత్తమం. విద్యా రుణం మంజూరు చేసే సమయంలో కళాశాల, కోర్సు వివరాలు, విద్యకు అయ్యే మొత్తం ఖర్చులు, అకడమిక్ రికార్డ్స్, కుటుంబ ఆదాయం, ఆస్తులు మొదలైన వివరాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. విద్యారుణాన్ని అందిస్తున్న కొన్ని బ్యాంకులు, అవి విధించే వడ్డీ వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.