Business

సులువుగా గృహఋణం పొందేందుకు ఈ సూచనలు పాటించండి

ఈజీగాఇంటి రుణం పొందాలనుకుంటున్నారా..అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో.. సామాన్యులు హోమ్​ లోన్​ లేకుండా ఇంటి నిర్మాణం చేయడం అనేది సాధ్యం కాదు. వాస్తవానికి ప్రైవేటు వ్యక్తుల దగ్గర చేసే రుణాల కంటే.. బ్యాంకులు ఇచ్చే గృహ రుణాలపై వడ్డీ రేట్లు చాలా వరకు తక్కువగానే ఉంటాయి. కానీ బ్యాంకులు అంత సులువుగా గృహ రుణాలు మంజూరు చేయవు. ఒక వేళ చేసినా దానికి చాలా సమయం పడుతుంది. కనీసం 3 నుంచి 4 వారాల పాటు దరఖాస్తు ప్రాసెస్​ జరుగుతూ ఉంటుంది.ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్ల వల్ల కూడా గృహ రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి తప్పులు ఏమీ చేయకుండా, తొందరగా హోమ్​ లోన్​ మంజూరు కావడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి.

బ్యాంకులు లేదా రుణ సంస్థలు ముందుగా చూసేది క్రెడిట్​ స్కోర్​నే. 750కి పైగా క్రెడిట్​ స్కోర్​ ఉంటే రుణార్హత ఉంది కనుక బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. అంతేకాదు.. అగ్ర శ్రేణి రుణ సంస్థల నుంచి బహుళ రుణ సదుపాయం కూడా పొందే వీలుంటుంది. అయితే మంచి క్రెడిట్​ స్కోర్​ సంపాదించడం ఒక్క రోజులో అయ్యే పనికాదు. మంచి క్రెడిట్​ స్కోర్​ సాధించడానికి కనీసం 3 నుంచి 24 నెలల వరకు పడుతుంది. అందుకే బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని మీరు అనుకుంటే.. కనీసం 2 నుంచి 3 ఏళ్ల ముందు నుంచే క్రెడిట్​ స్కోర్​ను పెంచుకునేందుకు ప్రయత్నించండి. కనీసం ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి మీ స్కోర్​ను చెక్ చేసుకోండి. ముఖ్యంగా క్రెడిట్​ కార్డ్​ బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్​ కార్డ్​ పరిమితిలో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే వాడుకోండి. మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. హోమ్​ లోన్ లాంటి పెద్ద మొత్తాలను రుణాలుగా పొందాలని అనుకుంటే.. ముందు చిన్న రుణాలను పూర్తిగా తీర్చేయండి.

మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ కలిసి హోమ్​ లోన్​ కోసం ప్రయత్నించడం మంచిది. సాధారణంగా సంపాదించే జీవిత భాగస్వామి విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇద్దరికీ ఆదాయాలు ఉన్నందున.. మీకు వేగంగా, అధిక మొత్తంలో గృహ రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ​దీనితో పాటు మహిళ సహ దరఖాస్తుదారుగా ఉంటే.. వడ్డీ రేటుపై రాయితీ కూడా లభిస్తుంది.

గృహ రుణాలు సాధారణంగా పెద్ద మొత్తంలో ఉంటాయి. కనుక వాయిదాలు కూడా పెద్ద మొత్తంలో కట్టాల్సి ఉంటుంది. ఇది సామాన్యులకు చాలా భారం అవుతుంది. అందుకే రుణ చెల్లింపు కాలవ్యవధి సుదీర్ఘంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఈఎంఐల భారీ కాస్త తగ్గుతుంది. అది మీ దైనందిన ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది.బ్యాంకులు కూడా సుదీర్ఘ రుణాలను మంజూరు చేయడానికే ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే, దీని వల్ల నెలవారీ ఈఎంఐలు డిఫాల్ట్​ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాస్తవానికి మొదట్లో ఎక్కువ కాల వ్యవధికి రుణాలు తీసుకున్నా.. తరువాత మన దగ్గర డబ్బు సమకూరినప్పుడు తొందరగానే బ్యాంకు రుణం తీర్చడానికి కూడా అవకాశం ఉంది.

బ్యాంకు రుణం పొందాలంటే కచ్చితంగా సంబంధిత పత్రాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ముందుగానే బ్యాంకుల అధికారిక వెబ్​సైట్​ను చూసి, అవసరమైన డాక్యుమెంట్స్​ అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.

ఉద్యోగుల విషయంలో పత్రాల జాబితా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. వీరు ప్రధానంగా ఐడీ, చిరునామా, జీతం స్లిప్​, ఐటీఆర్​, బ్యాంకు స్టేట్​మెంట్​లు అందజేయాల్సి ఉంటుంది.

స్వయం ఉపాధి పొందేవారు అయితే వ్యాపారానికి సంబంధించిన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. వ్యాపార యాజమాన్య హక్కులు తెలిపే పత్రాలు, జీఎస్​టీ స్టేట్​మెంట్స్​, ఐటీ రిటర్నులు, రాబడి వివరాలు మొదలైనవి అన్నీ సమర్పించాల్సి ఉంటుంది.