Devotional

మహారాష్ట్ర ఆలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్‌

మహారాష్ట్ర ఆలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్‌

మహారాష్ట్రలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నారా..! అయితే, మీ వస్త్రధారణ )పై దృష్టి సారించుకోవాల్సిందే. ఎందుకంటే.. దైవదర్శన సందర్భంగా భక్తులకు సరైన వస్త్రధారణ నిబంధనలు  అమలు చేసే దిశగా ఆలయాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడుకునేందుకుగానూ ‘మహారాష్ట్ర మందిర్‌ మహాసంఘ్‌ (Maharashtra Mandir Mahasangh)’ ఈ మేరకు విస్తృత ప్రచారం చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 130కిపైగా ఆలయాలు ఈ డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నాయి. దీంతోపాటు పుణ్యక్షేత్రాలకు 500 మీటర్ల పరిధిలో మద్యమాంసాల విక్రయాలపైనా నిషేధం విధించాలని మహాసంఘ్‌ కోరుతోంది. ఈ సంఘంలో ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, పూజారులు, న్యాయవాదులు, కార్యకర్తలు ఉన్నారు.‘ప్రజలను దేవుళ్లకు దూరం చేయడం మా ఉద్దేశం కాదు. అయితే.. కొంతమంది సోషల్ మీడియా పాపులారిటీ కోసం సరైన వస్త్రధారణ లేకుండా ఆలయాలకు వచ్చి వీడియోలు చేస్తున్నారు. ఏ ప్రార్థనా స్థలం అయినా పవిత్రతను కాపాడుకోవాలి.

ఈ నేపథ్యంలో ఆలయాల సందర్శన సమయంలో ఎటువంటి వస్త్రాలు ధరించకూడదనే దానిపై దృష్టిసారిస్తున్నాం. రివీలింగ్, షార్ట్ ఫిట్టింగ్ లేదా బిగుతుగా ఉండే వస్త్రాలు, చిరిగిపోయిన దుస్తులు వంటివి ఇందులో వస్తాయి. ప్యాంటు, చొక్కాల వంటివాటిపై ఎలాంటి అభ్యంతరం లేదు’ అని మహాసంఘ్ సమన్వయకర్త సునీల్ తెలిపారు. ఏడాది చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ ఆలయాలు దీన్ని అమలు చేస్తాయని చెప్పారు. ఆచార, సంప్రదాయాల ప్రకారం జంతుబలులు మినహాయించి.. దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో మద్యమాంసాల వాణిజ్య అమ్మకాలను నిషేధించాలనీ డిమాండ్ చేశారు.