చమురు దిగుమతి భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణానికి మేలు చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ (Ethanol) కలపి వినియోగించడాన్ని కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తోంది. దీనివల్ల రైతులకూ అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం 20 శాతం ఇథనాల్‌ను కలిపి పెట్రోల్‌నూ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలను భవిష్యత్‌లో తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇథనాల్‌తో నడిచే వాహనాల గురించి గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడారు. ఇటీవల మెర్సిడెజ్ బెంజ్ ఛైర్మన్‌తో తాను భేటీ అయ్యానని చెప్పారు. భవిష్యత్‌లో తాము తీసుకురాబోయే వాహనాలన్నీ ఇకపై విద్యుత్‌వే ఉండబోతున్నాయని తనకు చెప్పారన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పూర్తిగా ఇకపై ఇథనాల్‌తో నడిచే స్కూటర్లను బజాజ్, టీవీఎస్, హీరో తీసుకురాబోతున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టయోటా నుంచి కామ్రీ కారు విడుదల కానుందని గడ్కరీ తెలిపారు. ఇది నూరు శాతం ఇథనాల్‌తో నడుస్తుందని చెప్పారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ వల్ల ఎంతో ఆదా అవుతుందని చెప్పారు. లీటర్ పెట్రోల్ ధర రూ.120 ఉంటే ఇథనాల్ లీటర్ కేవలం రూ.60 మాత్రమేనని గడ్కరీ వివరించారు.