Business

PMSBY పథకం: రూ 20తో 2లక్షల ప్రమాద బీమా

PMSBY పథకం: రూ 20తో  2లక్షల ప్రమాద బీమా

ప్రజలకు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం 2015లో సురక్షా బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే చాలు.. రూ.2 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమాను మీరు పొందవచ్చు. ఏదేని అనుకోని ప్ర‌మాదాలు సంభ‌వించినప్పుడు మ‌ర‌ణించినా లేదా వైక‌ల్యం పొందినా ఈ పథకం మీకు అండగా ఉంటుందన్నమాట.

18 నుంచి 70 సంవత్సరాల మధ్య వ‌య‌సున్నవారు ఈ పథకంలో చేరవచ్చు.ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉంటే, అప్పుడు ఏదేని ఒక బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది.ఉమ్మడి ఖాతా విషయానికి వస్తే, ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథ‌కంలో చేరడానికి అర్హులు.ఎన్‌ఆర్ఐలు కూడా ఈ పథకంలో చేరవచ్చు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు నామినీకి భారత కరెన్సీలో చెల్లింపులు చేస్తారు.

గతంలో ప్రీమియం రూ. 12గా ఉండేది. దానిని ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం రూ.20కి పెంచింది. ప్రతి ఏడాది జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. అలాకాకుండా ప్రతి ఏడాది కొనసాగించాలి అనుకునేవారు చెల్లింపుల‌కు ఆటో డెబిట్ ఆప్ష‌న్ ఎంచుకోవచ్చు. ఈ విధంగా చేస్తే.. ప్రతి సంవత్సరం మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ పద్ధతిలో అమౌంట్ కట్ అవుతూ పథకంలో కొనసాగుతారు.

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద పాలసీదారుడు ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు చెల్లిస్తారు. అదే పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం అందిస్తారు. ప్రమాదంలో రెండు చేతులు/కాళ్ళు కోల్పోయినా, రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా.. దానిని శాశ్వత వైకల్యంగా పరిగణిస్తారు. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి లేదా ఒక కంటి చూపు కోల్పోతే.. దానిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు. సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం ఘటనలకు కూడా ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం వర్తిస్తుంది.