ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగి దేశాల్లో భారతదేశం (India) రెండో స్థానం (Second position) లో నిలిచింది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ (United States) ఉండగా.. చైనా (China) ను దాటేసి భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2014 నుంచి 1.45 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా భారతదేశం రెండో స్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మీడియా సమావేశంలో వివరించారు. తన పదవీకాలంలో తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను ఆయన వివరించారు. తొమ్మిదేళ్లలో భారతదేశం అనేక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆప్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం దాదాపు పూర్తి చేసిందని, ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైనదని గడ్కరీ వెల్లడించారు.
తొమ్మిదేళ్ల క్రితం భారతదేశ రహదారి నెట్‌వర్క్ 91,287 కిలో మీటర్లుగా ఉందని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్‌హెచ్ఏఐ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు. ఏప్రిల్ 2019 నుంచి ఎన్‌హెచ్ఏఐ 30వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ హైవేలను నిర్మిచిందని, ఇందులో ఢిల్లీని మీరట్‌తో అదేవిధంగా లక్నోను యూపీలోని ఘాజీపూర్‌తో కలిపే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు.
ఎన్‌హెచ్ఏఐ రోడ్ల నిర్మాణంలో అనేక ప్రపంచ స్థాయి రికార్డులు నెలకొల్పింది. వాటిలో ఈ ఏడాది మే నెలలో యూపీలోని ఘజియాబాద్ – అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సమయంలో ఎన్‌హెచ్ఏఐ 100 గంటల్లో 100 కిలోమీటర్ల కొత్త ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మించి రికార్డు సృష్టించింది. గత ఏడాది ఆగస్టులో ఎన్‌హెచ్ఏఐ-53లో అమరావతి – అకోలా మధ్య 75 కిలో మీటర్ల నిరంతర సింగిల్ బిటుమినస్ కాంక్రీట్ రహదారిని 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది.ఇదిలాఉంటే తొమ్మిదేళ్లలో టోల్ ఆదాయం భారీగానే పెరిగింది. తొమ్మిదేళ్ల క్రితం రూ. 4,770 కోట్లు ఉన్న టోల్ వసూళ్లు రూ. 41,342కోట్లకు పెరిగాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాకు తెలిపారు. కేంద్రం ఇప్పుడు టోల్ ఆదాయాన్ని 1.30లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని నితిన్ గడ్కరీ చెప్పారు.