NRI-NRT

మోదీని ప్రశ్న అడిగిన రిపోర్టర్‌పై వేధింపులు

మోదీని ప్రశ్న అడిగిన రిపోర్టర్‌పై  వేధింపులు

భారత ప్రధాని మోడీ తాజాగా అమెరికాలో మూడు రోజు పాటు పర్యటించారు. ఈ టూర్ చివర్లో ప్రధాని మోడీ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇది మోడీకి ప్రధాని హోదాలో తొలి ప్రెస్ మీట్. ఇందులో ఇబ్బందికరంగా కనిపించిన ప్రధాని మోడీని మరింత ఇబ్బందిపెట్టేలా వాల్ స్ట్రీట్ జర్నల్ మహిళా రిపోర్టర్ ఒకరు ప్రశ్నలు సంధించారు. ఇందులో భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లింలను టార్గెట్ చేయడంపై ప్రశ్నించారు. దీంతో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమంటూ ప్రధాని మోడీ అప్పటికప్పుడు సర్దిచెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రశ్న అడిగిన వాల్ స్ట్రీట్ జర్నల్ మహిళా రిపోర్టర్ సబ్రినా సిద్ధిక్ కు టార్చర్ మొదలైంది. భారత్ లో బీజేపీ అభిమానులు, కార్యకర్తలు ఆమెను ఆన్ లైన్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ సైతం స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం కాస్తా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూ చేరింది.

భారత ప్రధాని మోడీని ప్రెస్ మీట్లో ప్రశ్నించినందుకు వాల్ స్ట్రీట్ జర్నల్ మహిళా రిపోర్టర్ ను ఆన్ లైన్లో టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేయడంపై వైట్ హౌస్ ఇవాళ స్పందించింది. ఈ వేధింపుల్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. తన రిపోర్టర్‌పై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రశ్నకు సమాధానంగా ఉన్నత అధికారి జాన్ కిర్బీ.. వైట్ హౌస్ కు ఆ వేధింపుల నివేదికల గురించి తెలుసని అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని, జర్నలిస్టులపై ఎక్కడ ఎలాంటి వేధింపులు జరిగినా ఖచ్చితంగా ఖండిస్తామని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని తెలిపారు.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ కూడా తాము ఖచ్చితంగా బైడెన్ పాలనలో వైట్ హౌస్ లో ఉన్నామని, పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందుకే గత వారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. అలాగే, ఏదైనా జర్నలిస్టును బెదిరించడం లేదా వేధించే ప్రయత్నాలను ఖచ్చితంగా ఖండిస్తామన్నారు. కేవలం వారు తమ పని చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు