ScienceAndTech

చంద్రయాన్‌-3 ముహూర్తం ఖరారు

చంద్రయాన్‌-3 ముహూర్తం ఖరారు

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగానికి ముహూర్తం ఖరారయ్యింది. జులై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు జాబిల్లి వైపు దూసుకెళ్లనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ మిషన్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. యువ శాస్త్రవేత్త వీరముత్తుయేల్‌ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఉపగ్రహం అనుసంధాన పనులతోపాటు రోవర్‌, ల్యాండర్‌ బిగింపు పనులు ఏకకాలంలో చేస్తున్నారు. శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎం-3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది.ఇక చంద్రయాన్‌-1ను 2008లో చేపట్టగా.. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ.. దాదాపు ఏడాదిలోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలు అందించిన తర్వాత.. ఆ మిషన్‌ ముగిసినట్లు ఆగస్టు 2009లో ఇస్రో ప్రకటించింది. అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2.. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్‌ 3 ఈ మిషన్‌ విజయవంతమైతే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్లే.