Movies

ముద్దు సీను తర్వాత డెటాల్‌తో నోరు కడుక్కున్న నటి

ముద్దు సీను తర్వాత డెటాల్‌తో నోరు కడుక్కున్న నటి

తమన్నా, మృణాల్‌ ఠాకూర్‌, విజయ్‌ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లస్ట్‌స్టోరీస్‌ 2’ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు సీనియర్‌ నటి నీనాగుప్తా (Neena Gupta). ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఆన్‌స్క్రీన్‌ ఫస్ట్‌ లిప్‌ కిస్‌ అనుభవాన్ని పంచుకున్నారు. ముద్దు సన్నివేశం పూర్తైన వెంటనే డెటాల్‌తో నోరు శుభ్రం చేసుకున్నానని చెప్పారు.

‘‘ఒక నటిగా అన్నిరకాల సీన్స్‌లో యాక్ట్‌ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బురదలోకి దిగాలి. మరికొన్నిసార్లు గంటలపాటు ఎర్రటి ఎండలో నిలబడాలి. కొన్నేళ్ల క్రితం దిలీప్‌ ధావన్‌తో నేనొక సీరియల్‌లో నటించా. అందులోని ఓ సన్నివేశంలో మాపై లిప్‌ టు లిప్‌ కిస్‌ చిత్రీకరించారు. భారత టెలివిజన్‌ చరిత్రలో అదే మొట్ట మొదటి లిప్‌ కిస్‌ సీన్‌. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. మేము పరిచయస్తులం. అతడు అందగాడే కానీ, ఈ పరిస్థితులకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే, మానసికంగా, శారీరకంగా నేను సిద్ధంగా లేను. ఆ సీన్‌లో నటించడం కోసం ఎంతో కంగారు పడ్డా. కొంతమంది కామెడీ చేయలేరు. మరికొంతమంది కెమెరా ముందు కన్నీళ్లు పెట్టలేరు అంటూ నాకు నేను నచ్చజెప్పుకుని ముందుకు అడుగువేశా. ఆ సీన్‌ పూర్తైన వెంటనే డెటాల్‌తో నా నోరు శుభ్రం చేసుకున్నా. అది నాకెంతో కష్టంగా అనిపించింది’’ అని నీనాగుప్తా తెలిపారు.

వెండితెర పైనే కాకుండా బుల్లితెర వేదికగానూ ప్రేక్షకులను అలరించారు నటి నీనా గుప్తా. ‘ఇష్క్‌’, ‘ఎలోన్‌’, ‘ముల్క్‌’, ‘83’, ‘డయల్‌ 100’, ‘గుడ్‌బై’ వంటి చిత్రాల్లో నీనా కీలకపాత్రలు పోషించారు. సినిమాల్లో రాణిస్తోన్న తరుణంలోనే ఆమె ధారావాహికల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక, ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ విషయానికి వస్తే.. 2018లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమైంది. నాలుగు విభిన్నమైన కథలతో ఇది రూపుదిద్దుకుంది. ఈ నెల 29 నుంచి ఇది ప్రసారం కానుంది.