గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, టెలికాం రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కలిసి మన దేశంలో లేజర్ ఆధారిత ఇంటర్నెట్ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నాయి. ఆ ప్రాజెక్టు విశేషాలు తెలుసుకోండి.
టెలికాం రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) ఇటీవల గూగుల్ (Google) మాతృసంస్థ ఆల్ఫాబెట్‌తో (Alphabet) ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ (Internet) సేవలు అందించడానికి ఈ రెండు కంపెనీలు చేతులు కలిపాయి. అందుకోసం సరికొత్త లేజర్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఏంటా టెక్నాలజీ? ఎలా పని చేస్తుంది?
సరికొత్త ‘తారా’
లేజర్ ఆధారిత ఇంటర్నెట్ టెక్నాలజీని ఆల్ఫాబెట్ కాలిఫోర్నియాలోని ఇన్నోవేషన్ ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. దీనికి ‘ఎక్స్’ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టుకు అంతర్గతంగా ‘తారా’ అనే పేరు కూడా ఉంది. ఈ టెక్నాలజీలో కాంతి కిరణాలు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. అంటే కొన్ని కిలోమీటర్ల దూరం మధ్య ఏర్పాటు చేసిన టవర్లకు ట్రాఫిక్ లైట్ల వంటి పరికరాలను అమరుస్తారు. డేటా వేగం ఎక్కువగా ఉండే ప్రాంతంలోని పరికరం.. కాంతి, గాలి ద్వారా వేగం తక్కువగా ఉండే ప్రాంతంలోని పరికరానికి డేటాను పంపిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఫైబర్ నెట్ ద్వారా వివిధ కంపెనీలు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. ఆ నెట్ పొందాలంటే భూమిలోపల లేదా స్తంభాలపై కేబుళ్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త విధానంలో కేబుళ్ల అవసరం ఉండదు. ప్రాజెక్ట్ తారా కనిపించని పుంజం రూపంలో గాలి ద్వారా అధిక వేగంతో సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. అందు కోసం కాంతిని వినియోగించుకుంటుందని ఆల్ఫాబెట్ వెల్లడించింది. ఈ విధానంలో సుమారు 20 జీబీపీఎస్ స్పీడ్ అందుతుందని తెలిపింది.
గతంలో ఎక్కడ పరీక్షించారంటే..ఈ ప్రాజెక్టును గతంలో కాంగో నది వద్ద పరీక్షించారు. ఈ నదికి ఇరువైపులా బ్రాజవిల్, కిన్షాషా నగరాలున్నాయి. ఈ రెండు నగరాల మధ్య దూరం కేవలం 4.8 కిలోమీటర్లు. నది అడ్డుగా ఉన్న కారణంగా ఇంటర్నెట్ సేవల కోసం కేబుళ్లు వేయాలంటే 400 కిలోమీటర్లు చుట్టూ తిరిగిరావాల్సి ఉంటుంది. అందువల్ల కిన్షాషా నగరానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ఖరీదైన వ్యవహారంగా మారింది. దాంతో ఈ రెండు నగరాల మధ్య తారా ప్రాజెక్టును పరీక్షించారు. ఇరు వైపులా లేజర్ బీమ్‌లు ఏర్పాటు చేసి 20 రోజులు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. దాంతో సుమారు 20 జీబీపీఎస్ వేగంతో 700 టెరాబైట్ల డేటా మార్పిడి జరిగింది. ఈ ప్రయోగంలో 99.9 శాతం ఫలితం కనపడింది. రెండు నగరాల లేజర్ బీమ్‌ల మధ్యలోకి పక్షులు, వర్షం, మంచు అడ్డుగా రావడం వల్ల కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి.
నిపుణులు ఏమంటున్నారు…లేజర్ టెక్నాలజీ వల్ల కేబుల్స్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కేబుల్స్‌పై పెట్టాల్సిన ఖర్చు, నిర్వహణ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. రద్దీ రహదారులు, సున్నితమైన కొండ ప్రాంతాలను తవ్వాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఈ లేజర్ టెక్నాలజీని తొలుత భారత్, ఆఫ్రికా దేశాల్లో విస్తరించాలని ఆల్ఫాబెట్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
చౌకగా డేటా ధరలు..ప్రస్తుతానికి ఆల్ఫాబెట్ కంపెనీ ఎయిర్‌టెల్‌తో మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా నగరాలకూ ఈ సేవలను విస్తరింపజేయనున్నారు. దాంతో డేటా ధరలు మరింత తగ్గే సూచనలున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు. కందకాలు తవ్వడం, స్తంభాలు వేయడం వంటి ఖర్చులన్నీ ఉండవు కాబట్టి.. ఆ వచ్చే ప్రయోజనం వినియోగదారుడికే బదిలీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.