ఖమ్మం జిల్లాకు చెందిన న్యూయార్క్ ప్రవాసాంధ్రుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అభ్యర్థిత్వం భారత్ రాష్ట్ర సమితి(భారాస) ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో శరవేగంగా చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల దృష్ట్యా ప్రజల్లో మంచిపేరు ఉండి, సేవా కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించి, అన్ని వర్గాల వారితో చొరవగా సాగిపోగలిగే లక్షణాలు కలిగిన విద్యావంతుల కోసం భారాస పార్టీ చేయించిన సర్వేలో తాళ్లూరి మంచి మార్కులు సంపాదించినట్లు సమాచారం. ఈ రాజకీయ సమీకరణ మార్పులకు కేంద్ర బిందువులైన ఖమ్మం జిల్లా రాజకీయ నేతలు ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావల్సిందిగా ఆహ్వానిస్తూ విరివిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
పేరెన్నిక కలిగిన చాలా మంది ప్రవాసాంధ్రులు స్వదేశంలో రాజకీయాల్లో రాణించాలని కలలు కనడమే గాక వాటి సాధనకు ప్రతి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్టు ద్వారా ఖమ్మం జిల్లావ్యాప్తంగా పాఠశాలు, మంచినీటి ట్యాంకుల నిర్మాణం, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, వికలాంగులకు విద్యా-వైద్య-ఉపాధి అవకాశాల కల్పన వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు హైదరాబాద్‌లో ఇటు అమెరికాలో ఐటీ సంస్థలను విజయవంతంగా నిర్వహించి రాణిస్తున్న జయశేఖర్ వంటి వారు జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం రాణించాలని ప్రవాసాంధ్రులు కోరుకుంటున్నారు.
TNI ప్రత్యేకం: ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తాళ్లూరి జయశేఖర్?
Related tags :