దేశీయంగా కంది పప్పు సరఫరా పెంచేందుకు, ధరను నియంత్రణలో ఉంచేందుకు అర్హులైన మిల్లర్లకు కంది పప్పును వేలంలో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ వద్ద ఉన్న అదనపు నిల్వల నుంచి ఈ విక్రయాలు చేపట్టాలనుకుంటోంది. దేశీయ విపణిలోకి కంది పప్పు దిగుమతులు వచ్చేవరకు క్రమ పద్ధతిలో జాతీయ బఫర్ స్టాక్ నుంచి మిల్లర్లకు విక్రయాలు కొనసాగుతాయని అధికార ప్రకటన వెలువడింది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్), జాతీయ సహకార వినియోగదార్ల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్)లు ఆన్‌లైన్ వేలం ద్వారా కంది పప్పును అర్హులైన మిల్లర్లకు సరఫరా చేసి, వినియోగదార్లకు అందుబాటు ధరలో పప్పు లభించేలా చూడాలని వినియోగదారు వ్యవహారాల విభాగం సూచించింది. ఎంత పరిమాణంలో కంది పప్పును వేలంలో విక్రయించాలనేది విపణిలో లభ్యత, ధర ఆధారంగా ఉంటుంది.కంది పప్పు, మినప పప్పు స్టాక్ పరిమితిపై ఈ నెల 2న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 31 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవి అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం, ప్రతి రకం పప్పు టోకు విక్రయదార్ల వద్ద 200 టన్నులకు మించి ఉండకూడదు. రిటైలర్ల వద్ద 5 టన్నులు, రిటైల్ విక్రయ కేంద్రాల వద్ద 5 టన్నులు, పెద్ద చైన్ రిటైలర్ల డిపో వద్ద 200 టన్నులకు మించి నిల్వలు ఉండటానికి వీల్లేదు. గత 3 నెలల ఉత్పత్తి లేదా 25 శాతం వార్షిక ఇన్‌స్టాల్డ్ సామర్థ్యం ఏది ఎక్కువైతే ఆ పరిమాణంలో మిల్లర్ల వద్ద స్టాక్ ఉండేందుకు అనుమతి ఉంది. తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను ఎప్పకటికప్పుడు డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేస్తుండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వివరాలను వినియోగదారు వ్యవహారాల విభాగం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి.