భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ఫోన్ చేసి మాట్లాడారు. రష్యాలో ఇటీవల జరిగిన తిరుగుబాటు, యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించి ఇరు నేతలు మాట్లాడుకున్నారు. రష్యా ప్రైవేట్ మిలటరీ కంపెనీ (PMC) వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ (62) తిరుగుబాటును తాము తిప్పికొట్టిన విధానంపై మోదీకి పుతిన్ వివరించారు.రష్యాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అనంతరం వ్లాదిమిర్ పుతిన్ కనపడకుండా పోయారని ప్రచారం కూడా జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని బయటపెట్టలేదు. తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ తో రష్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ప్రిగోజిన్ ను విచారించబోమని, అంతేగాక రాజద్రోహం కేసును ఎత్తి వేస్తామని రష్యా చెప్పినప్పటికీ ఆ పని చేయట్లేదని ప్రచారం జరుగుతోంది. ఆయనపై నేరపూరిత కేసులను కూడా ఎత్తివేయలేదని వార్తలు వస్తున్నాయి. ప్రిగోజిన్ పై విచారణ జరుగుతోందని తెలుస్తోంది.రోస్తోవ్ ను యెవ్జెనీ ప్రిగోజిన్ తన ప్రైవేటు సైన్యంతో ఆక్రమించిన అనంతరం మాస్కో వైపుగా వెళ్లారు. అనంతరం ఉన్నట్టుండి అటు ప్రిగోజిన్, ఇటు పుతిన్ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. భారీ దాడులు జరుగుతాయని ప్రపంచం మొత్తం భావిస్తే మొత్తం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ సమయంలో మోదీకి పుతిన్ ఫోన్ చేయడం గమనార్హం.