Business

యూట్యూబ్ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం

యూట్యూబ్  ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ ‘యూట్యూబ్’ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రకటనల ఆదాయం తగ్గిపోతోంది. దీంతో తన ప్లాట్ ఫామ్ లో ఎన్నో మార్పులు చేస్తోంది. ఉచిత వీడియోల్లో ప్రకటన సంఖ్య పెంచుతోంది. అంటే ఇకమీదట మనం వీడియోలను చూసే సమయంలో ఎక్కువ ప్రకటనలు కనిపించనున్నాయి. దీనివల్ల సంస్థకు రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ప్రకటనల ఆదాయం పెరుగుతుంది. ఇన్నేసి ప్రకటనలు అడ్డుగా ఉన్నాయని అనిపిస్తే నెలవారీ చందా చెల్లించి ప్రకటనలు లేని సబ్ స్క్రిప్షన్ తీసుకునేలా వారిని ప్రోత్సహించనుంది. అలా కూడా యూట్యూబ్ కు ఆదాయం లభిస్తుంది.ప్రకటనల ఆదాయం తగ్గడానికి ఒక కారణం కూడా ఉంది. కొందరు యూజర్లు యాడ్ బ్లాకర్ టూల్స్ వాడుతున్నట్టు యూట్యూబ్ గుర్తించింది. దీనివల్ల యూట్యూబ్ వీడియోలను ఉచితంగానే ప్రకటనలు లేకుండా చూసుకోవచ్చు. ఇలాంటి యూజర్లపై చర్యలు తీసుకుంటోంది. యాడ్ బ్లాకర్ ను డిసేబుల్ చేసుకోవాలని లేదంటే, చూసే వీడియోల పరంగా పరిమితులు విధిస్తామంటూ హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. మూడు వీడియోలు చూసిన వెంటనే వీడియో బ్లాకర్ అప్లయ్ అవుతుందని స్పష్టం చేసింది. అంటే యాడ్ బ్లాకర్ సాఫ్ట్ వేర్ టూల్స్ వాడే వారు మూడు వీడియోలను మించి చూడలేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉచిత వీడియోల కంటెంట్ ను అందించేందుకు ప్రకటనల అవసరాన్ని యూట్యూబ్ గుర్తు చేసింది.