Agriculture

కప్పలు పై చిరుత పులి మచ్చలు చూసారా

కప్పలు పై చిరుత పులి మచ్చలు చూసారా

కప్పల్లో చాలా రకాలు ఉన్నాయి. మన దగ్గర సాధారణంగా బావుల్లో, చెరువుల్లో , రాళ్ల మధ్య, విద్యుత్​స్తంభాల వద్ద నిత్యం మనం కప్పలను చూస్తుంటాం. వర్షాకాలంలో గాండ్రుకప్పలు దర్శనమిస్తాయి. ఇవి పసుపు, లేత గోధుమ వర్గం, నలుపు రంగుల్లో కనిపిస్తాయి. కానీ​ చిరుతపులి చర్మం కప్పుకున్నట్టుగా ఉండే కొన్ని రకాల కప్పలు ఉన్నాయని చాలా మందికి తెలిసి ఉండదు. వీనిని చూస్తే అచ్చం చిరుతపులి చర్మం కప్పుకున్నట్టే ఉంటాయి. చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి వేడి ప్రదేశాల్లో ఉంటాయి. ఉష్ణమండల అడవుల్లో ఒకటైన డ్రై చాకో అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని శాంటా ఫె ఫ్రాగ్స్ అంటారు. ఇవి ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటిని వంద సంవత్సరాల క్రితమే గుర్తించారు. కానీ చాలా రోజుల వరకు పూర్తి సమాచారం అందుబాటులోకి రాలేదు. ఇటీవల ఓ ప్రత్యేక బృందం వీటిపై పరిశోధనలు చేసి కొంత సమాచారాన్ని సేకరించింది.అర్జెంటీనా, బొలీవియా, పరాగ్వేలో ఈ జాతి కప్పలు కనిపిస్తాయి. ఇవి 50 డిగ్రీల వేడి ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. భూగర్భంలో బొరియలు చేసుకొని నివసిస్తాయి. ఆడకప్పలను ఆకర్షించేందుకు మగ కప్పలు బొరియళ్ల నుంచి బయటకు వచ్చి గట్టిగా అరుస్తాయి. దాంతో ఆడ కప్పలు ఆకర్షించబడి మగవాటితో జతకడతాయి. తరువాత అవి రెండూ రాత్రివేళ బొరియళ్లకు వెళ్లి పునరుత్పత్తి ప్రారంభిస్తాయి. ఈ జాతి కప్పల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, వాటిని రక్షించేందుకు అనుసరించాల్సిన ఉత్తమ మార్గాల కోసం పరిశోధకుల బృందం ఆయా అడవుల్లో స్థానిక సంఘాల నేతలు, రైతులు, వేటగాళ్లను సంప్రదించి వివరాలు సేకరించింది.