సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఆహారం తినాలంటే కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వచ్చేది. కొంత కాలం తర్వాత పరిస్థితి మారింది. ఫోన్ ద్వారా ఆర్డర్ చేయగానే ఇంటి వద్దకు ఆహారాన్ని తీసుకువచ్చేవారు. ఆ తర్వాత డ్రోన్ సహాయంతో డెలివరీలు ఇవ్వటం ప్రారంభించారు. తాజాగా డోమినోస్ సంస్థ ఫుడ్ డెలివరీలో మరో ముందడుగు వేసింది. జెట్‌ప్యాక్ (Jetpack) సాయంతో గాల్లో ఎగురుతూ వచ్చి పిజ్జా డెలివరీ ఇస్తూ అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీలో మరో కొత్త సాంకేతికతను చేర్చారు.
డోమినోస్ (Dominos) సంస్థ తన సరికొత్త జెట్‌ప్యాక్ డెలివరీలను బ్రిటన్ (UK)లో ప్రారంభించింది. బ్రిటన్‌లో గ్లాస్టన్‌బరీ (Glastonbury) ఫెస్టివల్ సందర్భంగా పిజ్జా ప్రియులకు దీన్ని పరిచయం చేసింది. డెలివరీ ఏజెంట్లు గాల్లో ఎగురుతూ వచ్చి డోమినోస్ ఆర్డర్‌ను కస్టమర్లకు అందించారు. జెట్ ప్యాక్ ధరించి అచ్చం అవేంజర్ లాగా ఉన్న వ్యక్తి పిజ్జా స్టోరేజ్ బాక్స్‌కు భుజాన తగిలించుకొని గాలిలో ఎగురుతూ వచ్చాడు. కొండపైన గుడారాల్లో కూర్చున్న వారికి పిజ్జాను అందించటంతో వారు ఆశ్చర్యపోయారు. ఈ మెత్తం సంఘటనకు సంబంధించిన వీడియోను డోమినోస్ యూకే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. ‘ ఈ వారం మా రాకెట్ మ్యాన్ జెట్‌ప్యాక్ డెలివరీను ఎవరు చూశారు’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. దాంతో పాటు మీకూ ఒక స్లైస్ కావాలా అంటూ బ్రిటన్ ప్రముఖ సింగర్ ఎల్టన్ జాన్‌కు ట్యాగ్ చేసింది.డోమినోస్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఇది నిజమేనా?’ అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే ‘ఇది నిజంగా అద్భుతం’ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ‘ఇకపై ఈ పని మరింత ఆసక్తికరంగా మారుతుందంటూ మరి కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డోమినోస్ తన నూతన డెలివరీ పద్దతిని పరీక్షించటంలో భాగంగా నిర్వహించిందని మిర్రర్ తన రిపోర్ట్‌లో తెలిపింది.