Devotional

అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు

అన్నవరం దేవస్థానంలో  ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై శనివారం నుంచి ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించారు. కొండపై మంచినీరు తదితరాలకు ప్లాస్టిక్‌ సీసాలు, ప్యాకెట్లు, గ్లాసులు విక్రయాలు, వినియోగం నిషేధించామన్నారు దేవస్థానం ఈవో ఆజాద్‌. పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న ఈ చర్యలకు భక్తులంతా సహకరించాలని కోరారు. తాగునీటికి కేవలం స్టీలు, గాజు, రాగి సీసాలనే వినియోగించాలని సూచించారు.అంతేకాదు అన్నవరం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కాటేజీలలో అందుబాటులో ఉన్న వసతి, గదులు 50% కోటాను ఆన్ లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. భక్తులు http://www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫోన్‌ నంబర్, http://www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా సేవలు పొందొచ్చని తెలిపారు.

గదులతో పాటుగా స్వామివారి దర్శనాలు, ప్రసాదం, వ్రతాలు, కల్యాణాలు, ఇతర పూజలు, హోమాలు, అన్నదానం టికెట్లు, కల్యాణకట్ట, కల్యాణ మండపాలు బుకింగ్‌ ముందస్తుగా చేసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయంతో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టామంటున్నారు. అంతేకాదు అన్నవరం ఆలయంలో సంప్రదాయ వస్త్రధారణ నిబంధనను కూడా అమల్లోకి తెచ్చారు.భక్తులు వ్రతాలు, నిత్య కళ్యాణం, పూజలకు వెళ్లే సమయంలో కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలోనే పాల్గొనాలి. గతంలోనే ఈ నిబంధనను తీసుకొచ్చినా కొన్ని అనివార్య కారణలతో కుదరలేదు. ఇప్పుడు ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. మగవారు అయితే.. పంచె, కండువా.. కుర్తా, పైజమా ధరించాలి. మహిళలు అయితే చీర లేదా కుర్తా, పైజమా తప్పనిసరిగా ధరించాలని నిబంధన అమల్లో ఉంది.

మరోవైపు అన్నవరం ఆలయంలోని నిత్యాన్నదాన పథకంలో కీలక మార్పులు చేశారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అరిటాకులకు బదులు కంచాల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. అరిటాకుల లభ్యత విషయంలో ఇబ్బందులు ఉండటంతో కంచాలను తీసుకొచ్చారు. మొత్తం మీద అన్నవరం ఆలయంలో కూడా కీలక మార్పులు చేస్తున్నారు అధికారులు.