భోపాల్ : మధ్యప్రదేశ్‌లో టమాటా ధర ఆకాశాన్నంటింది. రైజెన్ జిల్లాలో కిలో టమాటా ధర రూ. 160 గా పలుకుతోంది. దీంతో స్థానికులు, గృహిణులు ఆందోళనకు గురవుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాల్లో కిలో టమాట ధర రూ. 120 నుంచి రూ. 150 మధ్య కొనసాగుతోంది.టమాట ధరలు పెరిగిన నేపథ్యంలో రైజెన్ జిల్లా కలెక్టర్ అరవింద్ దూబేను మీడియా సంప్రదించింది. టమాటాలకు డిమాండ్ పెరగడం, కొరత ఏర్పడటంతోనే ధరలు పెరిగాయన్నారు. ఏవైనా కూరగాయలకు డిమాండ్ తక్కువగా ఉండి, ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. కానీ టమాట సరఫరా తగ్గిపోవడంతో.. ధరలు పెరిగాయని తెలిపారు. టమాటా ధరలు పెరగడం ఒక్క ఈ జిల్లాలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని కలెక్టర్ గుర్తు చేశారు.
అయితే రైజెన్ జిల్లాలోని బారి ఏరియాలో టమాటాను అత్యధికంగా పండిస్తారు. ఇక్కడ్నుంచి దక్షిణ భారతదేశంతో పాటు నేపాల్‌కు టమాటాను ఎగుమతి చేయడంతో స్థానికంగా కొరత ఏర్పడి ధరలు పెరిగాయని తెలిపారు. టమాటా ధరలు పెరగడానికి దళారులే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు తమ వద్ద కిలో రూ. 20కి కొనుగోలు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు పేర్కొన్నారు.