అమెరికాలో తుపాకీ సంబంధిత మరణాలు ఏయేటి కాయేడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాల్టిమోర్ సిటీలో శనివారం అర్ధరాత్రి దాటాక బ్రూక్లిన్ హౌమ్ ఏరియాలోని బ్లాక్ పార్టీపై సాయుధ దుండగులు కొందరు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాల్టిమోర్ సిటీ యాక్టింగ్ పోలీస్ కమిషనర్ రిచర్డ్ వర్లీ ఆదివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మూకుమ్మడి కాల్పుల్లో బాధితులు 30 మంది దాకా ఉన్నారని చెప్పారు. చనిపోయినవారిలో 18 ఏళ్ల యువతి కూడా ఉన్నట్టు తెలిపారు. కాల్పుల తరువాత హంతకులను ఎవరినీ పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఆ ప్రాంతమంతా బీభత్సకర దృశ్యాలతో భయానకంగా ఉంది. ఇది పిరికిపందల చర్య అని మేయర్ బ్రాండ్ స్కాట్ పేర్కొన్నారు. నిందితులకు సంబంధించి ఎటువంటి సమాచారం తమ వద్ద ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని స్కాట్ స్థానికులకు సూచించారు. హింసాత్మక నేరాలు ఇంతగా పెరిగిపోతుండడానికి తుపాకుల అమ్మకాలపై ఎలాంటి అడ్డు అదుపు లేకపోవడమే కారణమని సామాజికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టాలని 60 శాతం మంది అమెరికన్లు గట్టిగా అభిప్రాయపడ్డారు. తుపాకీ హింస అతి పెద్ద జాతీయ సమస్యగా ఉందని వారు పేర్కొన్నారు. 9 శాతం మంది మాత్రం గన్స్ ఉంటేనే తుపాకీ యజమాన్యాలకు భద్రత అని పేర్కొన్నారు. తుపాకీ నియంత్రణ బిల్లు ఎప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చినా రిపబ్లికన్లు, డెమొక్రాట్లలో ఒక సెక్షన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నది.ఈ ఏడాది ఇంతవరకు 337 మాస్ షూటింగ్స్ (సామూహిక కాల్పులు) ఘటనలు చోటు చేసుకున్నాయి.