పిపా యువాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్. ఇది చైనాలోని నాన్ జిల్లా చాంగ్‌కింగ్ నగర శివార్లలోని కొండ ప్రాంతాల్లో ఉంది ఈ రెస్టారెంట్. దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. వంటకాలను రుచి చూస్తే వాహ్ అనాల్సిందే. ఈ రెస్టారెంట్లో మొత్తం 900 పైగా టేబుళ్లు ఉన్నాయి. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెస్టారెంట్లో 5,800 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు. 2022లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది ఈ రెస్టారెంట్.చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు, ఛెఫ్‌లు ఉంటారు. వీరితో పాటు 25 మంది క్యాషియర్స్ కూడా ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. రాత్రి సమయంలోనూ ఈ రెస్టారెంట్‌కు వస్తుంటారు కస్టమర్లు. ఆ సమయంలో వివిధ రకాల విద్యుత్ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణం.బుక్ చేసుకున్న టేబుళ్లను కస్టమర్లకు చూపించేందుకు ఇక్కడ ప్రత్యేకంగా కొంత మంది సిబ్బంది కూడా ఉంటారు. ఆర్డర్ ఇచ్చిన డిష్ కోసం కస్టమర్ల దాదాపుగా అరగంట సేపు ఆగాల్సిందే. రోజు రోజుకి ఈ రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇక వేసవి కాలంలో రిజర్వేషన్ లేకుండా ఇక్కడి వస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సిందే. ఆ సీజన్లో ఇక్కడ టేబుల్ దొరకడమే కష్టంగా ఉంటుంది. విపరీతంగా వచ్చే ప్రజలతో.. ఈ రెస్టారెంట్ జాతరను తలపిస్తూ ఉంటుంది. ఈ రెస్టారెంట్‌కు ఇంతమంది కస్టమర్లు వస్తుంటే.. అక్కడున్న సిబ్బంది ఆర్డర్లను రుచిగా ఇస్తారా లేదా అన్న అనుమానం మనకు కలగవచ్చు. కానీ ఇక్కడికి ఎంత మంది వచ్చిన రుచికరమైన ఆహారం అందిస్తారు రెస్టారెంట్ సిబ్బంది. కస్టమర్ల నుంచి కూడా ఈ రెస్టారెంట్ మంచి స్పందనే వస్తోంది.