NRI-NRT

హాంకాంగ్‌లో అలరించిన కూచిపూడి రంగప్రవేశం

హాంగ్కాంగ్ లో పురివిప్పిన హాంగ్కాంగ్ కూచిపూడి నాట్య మయూరాలు

కూచిపూడి నృత్యం అనగానే చురుగ్గా లయ బద్ధoగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైన దేహ భంగిమలు, హస్తలు, కళ్ళతో చేసే కదలికలు , ముఖం లో చూపించే భావాలు , ముఖాభినయం తో కూచిపూడి నృత్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.ఇలా కూచిపూడి కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్ధండులు.

ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఒకటైన కూచిపూడి నాట్య నాటక నృత్యాన్ని హాంగ్ కాంగ్ లో తొలి సారిగా పరిచయం చేసిన స్థానిక కూచిపూడి నాట్యాచార్యులు ఈరంకి శ్రీహరి బాలాదిత్య (హరిఓం) తమ ఇద్దరు విద్యార్థుల రంగప్రవేశం ఎంతో వైభవంగా నిర్వహించారు.

శిష్యులు సింథియా లావ్ మే 25న మరియు జాకీ లా జూన్ 26న కూచిపుడి రంగప్రవేశం ప్రదర్శించి అందరిని వారి ప్రదర్శన తో ప్రేక్షకులని అలరించారు. రెండు కార్యక్రమాలు కుంటాన్గ్ క్రిస్టియన్ ఫ్యామిలీ సర్వీస్ సెంటర్ ఆడిటోరియం లో అందరి మన్ననలను అందుకుని విజయవంతంగా హరిఓం డాన్స్ సొసైటీ మరియు చిల్డ్రన్స్ కల్చరల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డాయి.

మే 25 కార్యక్రమంలో స్థానిక ప్రముఖ కథక్ గురువు శ్రీమతి శ్వేతా రాజపుత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. జూన్ 26 కార్యక్రమంలో స్థానిక ప్రముఖ కథక్ గురువు శ్రీమతి నిషా ఝవేరి గారు, కాన్సులర్ సర్వీసెస్ కాన్సుల్ శ్రీ కే. వెంకట రమణ గారు ,డాక్టర్ సంజయ్ నాగర్కర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. శ్రీ కే. వెంకట రమణ గారు మన భారతీయ నాట్య శాస్త్ర ప్రాముఖ్యతను వివరించి, విదేశీయులు నేర్చుకున్నందుకు తమ హర్షం తెలియజేసారు.

హాంగ్కాంగ్ లో పుట్టి పెరిగినా, మన భారతీయ కళలపై ఆసక్తితో మన తెలుగు సంస్కృతీ చిహ్నమైన కూచిపూడి నాట్యాన్ని 15 సంవత్సరాలుగా అభ్యసించి ప్రదర్శించడం ప్రశంసనీయం. అంతేకాదు, వారికి నాట్య వస్త్రాలు, నగలు, మేకప్ చేసుకోవడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. అయినా అలుపు ఎరుగక తమకు కూచిపూడి నాట్యం పట్ల శ్రద్ధ – మక్కువ లో ఎటువంటి సడలింపు కలగడం లేదు కదా వారి పట్టుదల మక్కువ పెరుగుతూనే వుంది.. జోయి చాన్ మరియు సిసిలియా చాన్ దాదాపు రెండు దశాబ్దాలు గా మన భారతీయ నాట్యం ప్రదర్శిస్తున్న హాంగ్ కాంగ్ కళాకారుల కి మేకప్ చేస్తూ అందరి ప్రేమ అభిమానాలు పొందుతున్నారు.

మే 25 సింథియా లావ్ ప్రదర్శనలో పూర్వరంగం తరువాత శ్రీ సకల గణాధిప పాలయమాం తో ప్రారంభించి, అన్నమయ్య కీర్తన నందకధర, ధనశ్రీ తిల్లాన, రుక్మిణి ప్రవేశం, నాయక జావళి మరియు కూచిపూడి సలాము నృత్యాంశాలు ప్రదర్శించారు.

జూన్ 26 జాకీ లా ప్రదర్శనలో పూర్వరంగం తరువాత మామవతు శ్రీ సరస్వతి తో ప్రారంభించి భామాకలాపం లో మూడు ముఖ్యాంశాలను ప్రదర్శించారు. అందులో భాగంగా ప్రవేశ దరువు , సత్యభామ మాధవి సంభాషణ మరియు మదన దరువు నయనానందకరంగా ప్రదర్శించారు . కార్యక్రమములో ఇంకా భో శంభో, భాగేశ్వరి తిల్లాన మరియు గోవర్ధన గిరిధార తరంగం కూడా నర్తించారు.

కూచిపూడి నేర్చుకొంటున్న మహిళలలో చాలా వరకు గృహిణిలు , ఉద్యోగస్తులు మన దేశం కాదు, మన భాష కాదు, మన సంస్కృతీ కాదు , మన కట్టు బొట్టు కాదు, అయినా వారికి మన కూచిపూడి నాట్యం పట్ల వున్న అభిమానానికి, నేర్చుకోవాలన్న ఆసక్తి, నిబద్ధత ప్రశంసనీయం అందుకు వారి గురువు శ్రీహరి గారి కృషి కూడా చెప్పుకోతగ్గ విషయం అని ది హ్యాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. హాంగ్ కాంగ్ లో ప్రదర్శనలలో పాల్గొనడమే కాదు, విదేశాలలో కూడా వీరు ఎన్నో ప్రదర్శలలో పాల్గొన్నారు. కళలకు, కళాకారులకు సరిహద్దులు లేవని , కళాభిమానానికి హద్దులు లేవని హాంగ్ కాంగ్ నాట్య మయూరాలే చక్కటి ఉదాహరణలు!! జై తెలుగు తల్లి , జై కూచిపూడి !!