పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర వంద రూపాయలు ఎప్పుడో దాటేసింది. ఇలాంటి తరుణంలో రూ.15కే లీటర్ పెట్రోల్ లభించే మార్గం ఉందంటున్నారు కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. అయితే.. 60% ఇథనాల్, 40% విద్యుత్తును తీసుకుంటే లీటర్ పెట్రోల్ రూ.15కే లభిస్తుందన్నారు. కాలుష్యం కూడా తగ్గుతుందని, పెట్రోల్ దిగుమతులకు ఖర్చు చేస్తున్న రూ.16 లక్షల కోట్లు దేశంలోని రైతులకే వెళ్తాయని చెప్పారు. రాజస్థాన్‌లో రూ.5,600 కోట్ల విలువైన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు.‘అన్నదాత’ (ఆహార ప్రదాతలు)గా ఉన్న రైతులను ‘ఉర్జాదాత’ (ఇంధన ప్రదాతలు) గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి చెప్పారు. రైతులు ఉత్పత్తి చేస్తున్న ఇథనాల్‌తోనే ఎక్కువ శాతం వాహనాలు నడుస్తున్నాయని, దీంతో కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు కూడా కలుగుతుందన్నారు. పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలను త్వరలో ప్రవేశ పెడతామని గడ్కరీ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. బజాజ్, టీవీఎస్, హీరో టూ వీలర్ల కంపెనీలు 100% ఇథనాల్‌తో నడిచే వాహనాలనే తయారు చేస్తామని ప్రకటించాయి. పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే క్యామ్రీ కారును ఆగస్టులో విడుదల చేస్తామని టయోటా కంపెనీ ప్రకటించింది. ఇది 40% విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. ఇలా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే రైతు విద్యుత్ దాతగా కూడా మారతాడు.