Politics

జగన్ సంస్థలకు సుప్రీం నోటీసులు

జగన్ సంస్థలకు సుప్రీం నోటీసులు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ సంస్థలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్ , భారతి సిమెంట్స్, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో తొలుత సీబీఐ కేసులు విచారించాలని, అప్పటి వరకు ఈడీ రిజిస్టర్ చేసిన కేసుల విచారణ ఆపాలని ట్రయల్ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ సమాంతరంగా జరిపితే…. సీబీఐ కేసులపై తీర్పు తర్వాతే… ఈడీ కేసులపై తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం ఆదేశించింది.సీబీఐ నమోదు చేసిన కేసులు, ఈడీ నమోదు చేసిన కేసులు సమాంతరంగా విచారణ కొనసాగించవచ్చునని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ ధర్మాసనం కొట్టివేసింది. హైదరాబాబ్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తుది ఆదేశాలపై 2021లో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ సంజయ్‌ కరోలలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలన్నది ఆరోజు నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంటూ.. సెప్టెంబర్ 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. వైఎస్‌ భారతి రెడ్డిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై…. ఈ కేసులతో జత పరిచి ఉన్న పిటిషన్‌ను విడిగా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.