Business

నోకియాతో జియో భారీ ఒప్పందం-TNI నేటి వాణిజ్య వార్తలు

నోకియాతో జియో భారీ ఒప్పందం-TNI నేటి వాణిజ్య వార్తలు

నోకియాతో జియో భారీ ఒప్పందం

భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో(Reliance Jio).. నోకియాతో(Nokia) భారీ ఒప్పందం చేసుకోనుందని సమాచారం. 5జీ నెట్‌వర్క్ పరికరాలను కోనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరగనుందని తెలుస్తోంది. ఈ ఒప్పందం విలువ $1.7బిలియన్లు. అంటే మన కరెన్సీలో రూ.14,016 కోట్లు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ఎకానమిక్ టైమ్స్(Economic Times) రాసుకొచ్చింది. ఈ రోజే ఈ భారీ డీల్‌పై జియో, నోకియా మధ్య ఒప్పందం కుదరనుందని, దీనికి సంబంధించిన సంతకాలు కూడా చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. నోకియా ప్రధాన కార్యాలయం ఉన్న ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో ఈ ఒప్పందంపై సంతకాలు చేయొచ్చని ఎకానమిక్ టైమ్స్ నివేదికలో ఉంది.గతేడాది ఆగస్టులో జరిగిన 5జీ స్ప్రెక్టమ్ వేలంలో (5G spectrum auction) రిలయన్స్ జియో $11 బిలియన్‌ల విలువ చేసే ఎయిర్‌వేవ్‌లను దక్కించుకుంది. దీని విలువ మన భారతదేశ కరెన్సీలో రూ.90,600 కోట్లు. ఈ వేలం అనంతరం జియో అనేక నగరాల్లో 5జీ నెట్‌వర్క్ సేవలను కూడా ప్రారంభించింది. అలాగే 5జీ స్మార్ట్ ఫోన్లను తయారు చేయడానికి ఆల్ఫాబెట్ గూగుల్‌తో కలిసి పనిచేస్తుంది. జియో 5జీ సంబంధిత కోనుగోళ్లకు మద్దతు ఇస్తున్న వాటిలో హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్ ఉన్నాయని ఎకానమిక్ టైమ్స్ తెలిపింది.

డిసెంబరులోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి: సీఎం జగన్‌

కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన చోట భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖపై  జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరించారు. విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని సీఎం ఆదేశించారు.

*  మెటా థ్రెడ్స్‌ నిమిషాల్లోనే సంచలనం

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ట్విటర్’ పోటీగా సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా థ్రెడ్స్’ (Meta Threads) యాప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి? ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ ‘మార్క్ జుకర్‌బర్గ్’ స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు.

అదానీ గ్రూప్‌లో మరింత తగ్గనున్న ప్రమోటర్ల వాటా

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాలను మరింత తగ్గించుకోనున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత గ్రూప్‌ సంస్థల్లో అదానీ కుటుంబం తమ వాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వాటాలను తగ్గించుకోవాలని చూస్తోంది. నగదు నిల్వలను పెంచుకొనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

హీరోయిన్స్‌ని మించిపోయిన సితార

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార అప్పుడే ఒక పెద్ద సెలెబ్రిటీ స్టేటస్ ను, సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇటీవలే సితార ఒక జ్యువెలరీ కంపెనీ కమర్షియల్ యాడ్ లో నటించింది. ఈ యాడ్ ను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని బిల్ బోర్డుపై కూడా ప్రదర్శించారు.మరోవైపు ఈ యాడ్ కు సితార ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే చర్చ కూడా జరుగుతోంది. సదరు జ్యువెలరీ సంస్థ సితారకు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చిందని చెపుతున్నారు. చాలా మంది హీరోయిన్లకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఉండదనే విషయం తెలిసిందే.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 100 పెరగడంతో రూ.54,250గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 100 పెరగడంతో రూ.59,160కి చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.75,800 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

మహిళల కోసం కేంద్రం అదిరిపోయే పథకం

మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తో్న్న మరో పథకం ఉద్యోగిని పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 3 లక్షల రుణం అందిస్తున్నారు. 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అర్హతలున్న మహిళలకు కేంద్రం ప్రభుత్వం రూ. 3 లక్షల రుణం పొందొచ్చు. అంతేకాకుండా అంగవైకల్యం, వింతత మహిళలకు వారు నెలకొల్పే వ్యాపారం ఆధారంగా రుణ పరిమితి పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

ఖరీదైన కారును విడుదల చేసిన మారుతి

భారత్ లో మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో కార్లను అందించే కంపెనీల్లో మారుతి సుజుకీ ముందుంటుంది. దేశంలో అత్యధిక కార్లు అమ్ముడయ్యే కంపెనీ కూడా ఇదే. మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా ప్రీమియం కార్లపైనా మారుతి దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భారత్ లో తమ కంపెనీ నుంచి అత్యధిక ఖరీదైన కారు ఇన్విక్టోని ప్రవేశ పెట్టింది. ఈ మల్టీ పర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ) ధర రూ.24.8 లక్షల నుంచి రూ.28.4 లక్షల మధ్య ఉంది. జెటా (7 సీడర్), జెటా ప్లస్ (8 సీటర్), ఆల్ఫా (7 సీజర్) అనే మూడు వేరియంట్లలో ఈ మోడల్‌ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ కారు ప్రాథమికంగా గతేడాది వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్ కి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. మారుతి–టయోటా కిర్లోస్కర్ మధ్య ఏడేళ్ల నుంచి భాగస్వామ్యం ఉంది. దేశీయ ఎంపీవీ సెగ్మెంట్‌లో మారుతికి 50 శాతం వాటా ఉంది. ఇన్విక్టోలో ఆరు ఎయిర్‌‌బ్యాగ్‌లు, ముందు, వెనుక డిస్క్‌ బ్రేక్స్ ఉన్నాయి. అలాగే, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్ బ్రేక్‌లు, ఏబీఎస్‌, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి రక్షణ ఫీచర్లు ఇన్విక్టోలో ఉన్నాయి. నాలుగు రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

పెట్టుబడికి సరైన మార్గలివే

పెట్టుబడి పెట్టడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మంచి ఎంపికలను అందరూ చెబుతూ ఉంటారు. ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెడితే స్థిరమైన రాబడిని ఇస్తాయి. అయితే మనం పెట్టిన పెట్టుబడికి మాత్రం లాక్-ఇన్ పీరియడ్‌ను ఉంటుందని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు పథకాలు పదవీ విరమణ కార్పస్‌ను నిర్మించడంలో సాయపడతాయి. అయితే వీటిల్లో పెట్టుబడి పెట్టడానికి మీరు పోస్టాఫీసు లేదా బ్యాంక్‌లో ఎఫ్‌డీ లేదా పీపీఎష్‌ ఖాతాను తెరవవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు హామీతో కూడిన రాబడిని పొందవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ట్రిపుల్ పన్ను మినహాయింపుల ప్రయోజనాన్ని పొందవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలు, జమ, డబ్బు ఉపసంహరణ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే పోస్టాఫీసు ఎఫ్‌డీలు కూడా హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. ఇక్కడ మీరు నిర్ణీత కాలానికి డిపాజిట్లు చేయాలి. ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్ 6.8 శాతం,, రెండు నుండి మూడు సంవత్సరాల ఎఫ్‌డీలు 7 శాతం పొందుతాయి. అయితే ఐదేళ్ల పాటు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మీ డిపాజిట్లపై 7.5 శాతం రాబడిని పొందుతాయి.

రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు

ఏపీ వ్యాప్తంగా 3432కి.మీ మేర రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1121.92 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. రాష్ట్ర రహదారుల కోసం రూ.490.80 కోట్లు, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ. 631.12 కోట్లు మంజూరు చేస్తున్నట్లు R & B శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 437 పనులకు సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలపగా.. ప్రతి జిల్లాలో సగటున 6 రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయి