ధాన్యం ఉత్పత్తి వ్యయం పంజాబ్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువగా ఉంది. దేశ సగటుతో పోల్చినా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడించింది. పంజాబ్‌లో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ.808 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,061గా నమోదైంది. దేశంలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి సగటు వ్యయం రూ.1,360 ఉన్నట్టు తెలిపింది. వ్యవసాయ భూమి లీజుతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, కుటుంబ సభ్యుల శ్రమ, పశువుల శ్రమ, ఇరిగేషన్ చార్జీలు, పెట్టుబడి వ్యయం, వడ్డీలను కలిపి రాష్ట్రాల వారీగా 2022–23లో ధాన్యం క్వింటాల్ ఉత్పత్తి వ్యయాన్ని వెల్లడించింది.రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి సేద్యానికి అవసరమైన అన్నిరకాల ఇన్‌పుట్స్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీపై విత్తనాలను అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతింటే ఆ సీజన్ దాటకుండానే ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తోంది.
కూలీలకు బదులుగా వ్యవసాయ పరికరాలను వినియోగించడాన్ని ప్రోత్సహించడంతో సేద్యం వ్యయం తగ్గుతోంది. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా 50 సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. యంత్ర పరికరాల వినియోగం కారణంగా ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుండటం, మెరుగైన వ్యవసాయ పద్ధతుల కారణంగా ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటోంది.దేశంలో ఎక్కువగా ధాన్యం పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండగా మహారాష్ట్రలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం అత్యధికంగా ఉంది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంది. వరి పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది.