WorldWonders

ఇక్కడ ఆలయంలో ఛాయ్‌ని తీర్థంగా ఇస్తారట !

ఇక్కడ ఆలయంలో ఛాయ్‌ని తీర్థంగా ఇస్తారట !

గుడికి వెళ్లిన వారు.. దేవుడిని దర్శించుకున్న తరువాత గుడిలో పెట్టే ప్రసాదం తీసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గుడికి వెళ్లిన వారికి సాదారణంగా గుళ్లో ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, అటుకులు, బెల్లం, అరటిపండు ఇస్తారు. ప్రసాదంతోపాటు తీర్థం ఇస్తారు. దాదాపు అన్ని దేవాలయాల్లో ఇలానే తీర్థ, ప్రసాదాలు ఇస్తుంటారు. కానీ ఆ ఆలయంలో ఇచ్చే తీర్థం వెరైటీ.. అక్కడ పెట్టే ప్రసాదం కూడా వెరైటీనే. అవేంటో అనుకుంటున్నారా? అక్కడ ఛాయ్‌ ని తీర్థంగా ఇస్తారు.. ఇక ప్రసాదంగా అయితే పెసర గుడాలను ఇస్తారు. అదేంటీ ఇదేదో వింతగా ఉందనుకుంటున్నారా? వీటిని తీర్థ ప్రసాదాలుగా ఇస్తున్న గుడి ఎక్కడ ఉందో తెలుసుకుందాం.పత్రం, పుష్పం, ఫలం, నీరు.. ఏదైనా భక్తితో సమర్పిస్తే దానిని తాను సంతోషంగా స్వీకరిస్తానని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ తను బోధించిన గీతలో చెబుతాడు. అయితే వాటికి అదనంగా తేనీరు(చాయ్‌) కూడా జతచేర్చారు కేరళీయులు. పరమాత్మకు నివేదించిన ఉష్ణోదకాన్ని ఆ గుడికి వచ్చేవారందరికీ ప్రసాదంగా పంచుతుంటారు. ఏకాక్షరికి ఇంతటి ఘనత కట్టబెట్టిన ఆలయం పేరు ముత్తప్పన్‌ కోవెల. కేరళలోని కన్నూరు జిల్లా పరాసినిక్కడవు గ్రామంలో ఉంటుందీ గుడి. ఇక్కడ వెలసిన ముత్తప్పన్‌ ఆదివాసీల ఆరాధ్య దైవం. హరిహరుల అంశగా ఈ స్వామిని కొలుస్తారు. ముత్తప్పన్‌ను అయ్యప్పగా భావిస్తారు కొందరు.

ఉత్తర మలబారులో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న పరాసినిక్కడవులో ముత్తప్పన్‌ ఆలయం మరింత ప్రత్యేకం. ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయిక్కడ. అందులో పాలుపంచుకోవడానికి కేరళ నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు అక్కడికి వస్తుంటారు. ఈ సంగతి పక్కనపెడితే, ఇక్కడ తేనీటిని నైవేద్యంగా సమర్పించడం, ప్రసాదంగా భక్తులకు పంచడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ తేనీటితోపాటు పెసర సొండెలు ప్రసాదంగా అందిస్తారు. వినడానికి వింతగా ఉన్నా.. నేటికీ ఇక్కడ తేనీరే తీర్థంగా ఇస్తారు. ఆ మాటకొస్తే ఉదయం పూట కాచే తొలి టీని దేవుడి పటం ముందుంచి నైవేద్యం పెట్టే కుటుంబాలు మన దగ్గరా కనిపిస్తాయి. ఈ ఉష్ణోదకం ముందు అమృతం కూడా దిగదుడుపే.. అందుకే టీ నివేదనం అంటారు తేనీటి ప్రేమికులు.