Business

30 ఏళ్లకే రికార్డులు-TNI నేటి వాణిజ్య వార్తలు

30 ఏళ్లకే రికార్డులు-TNI నేటి వాణిజ్య వార్తలు

30 ఏళ్లకే రికార్డులు

ఓ యువకుడు 30 ఏళ్లకే రికార్డులు తిరగరాశాడు. జైపూర్కు చెందిన రోమన్ సైనీ 16 ఏళ్లకే AIIMSలో ఉత్తీర్ణులై డాక్టర్గా పట్టా అందుకున్నారు. కలెక్టర్ కావాలన్న కోరికతో UPSCకి సన్నద్ధమై 22 ఏళ్లకే నేరుగా ఐఏఎస్కు ఎంపికయ్యారు. కొన్నాళ్లు మధ్యప్రదేశ్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అనంతరం స్నేహితులతో కలిసి ఒక ఎడ్-టెక్ ప్లాట్ఫాం స్థాపించి, అంచెలంచెలుగా రూ.2,600 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దారు.

* నేడు గ్యాస్ సిలిండర్ రేట్లు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల రేట్లు భగ్గుమంటున్నాయి.హైదరాబాద్: రూ.1,115 ,వరంగల్: రూ. 1,174,విశాఖపట్నం: రూ.  1,112, విజయవాడ: రూ. 1,118, గుంటూర్: 1,114.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

హమ్మయ్య కొనుగోలుదారులకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చేశాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గడమో.. లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది తప్ప పెరిగింది అయితే చాలా తక్కువ. జులై నెలలో అయితే పెరిగింది.. ఒకరోజో.. లేదంటే రెండు రోజులు మాత్రమే. అది కూడా తులం బంగారంపై రూ.100 మాత్రమే పెరిగింది. దానిని ఒక పెరుగుదలగా కూడా పరిగణలోకి తీసుకోలేం. ఇక నేడు బంగారం, వెండి ధరలు రెండూ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510కి చేరుకుంది. ఇక వెండి కిలో ధర రూ.73,300కు చేరుకుంది. 

డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోన్న టమాట

దేశమంతటా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తరాదిన వర్షాలు జోరందుకోవడంతో మార్కెట్లలో టమాటా ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కిలో టమాట హోల్‌సేల్ ధర కిలో రూ.140 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో టమాటా ధర రూ.200 వరకు చేరవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాలలో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాల కారణంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, ఆకు కూరలు మొదలైన కూరగాయల ధరలు ఖరీదైనవిగా మారనున్నాయి.హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం తదితర పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ తెలిపారు. ఫలితంగా ధరలు మరింత పెరగనున్నాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ సీజన్‌లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్‌లను ఉత్తరాది రాష్ట్రాలు ప్రధాన సరఫరాదారుగా ఉన్నాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోతుండటంతో వినియోగదారులు పప్పు దినుసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెరిగిన పప్పుల ధరలపైనా దీని ప్రభావం కనిపిస్తోందని సింగ్‌ పేర్కొన్నారు.

2 వేల కేజీల టమాటా వాహనం చోరీ

టమాటాలను మార్కెట్కు తరలిస్తున్న వాహనాన్ని చోరీ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. చిత్రదుర్గలోని ఓ రైతు కోలార్ మార్కెట్కు 2 వేల కేజీల టమాటాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు కారులో టమాటా వాహనాన్ని అనుసరించారు. తమ వాహనాన్ని ఢీకొట్టారంటూ ఆరోపించిన దుండగులు టమాటా వాహన డ్రైవరు, రైతుపై దాడి చేశారు. అనంతరం రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి టమాటాల వాహనంతో పారిపోయారని పోలీసులు తెలిపారు.

ఏపీలో పూరి గుడిసెకు రూ.3.32 లక్షల కరెంట్ బిల్లు

నాలుగంటే నాలుగు అడుగుల జాగాలో ఉన్న పూరిగుడిసె.. ఆ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుందీ విచిత్రం.అనకాపల్లి జిల్లాలోని ఎస్‌ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలో ఓ పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఈ నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.3,31,951 లు రావడంతో రాజుబాబు కుటుంబం షాక్ అయింది. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు రావడమేంటని అధికారులను ఆశ్రయించారు.విద్యుత్ శాఖ అధికారులు రాజుబాబు బిల్లును పరిశీలించి సాంకేతిక తప్పిదం వల్ల ఈ పొరపాటు చోటుచేసుకుందని తేల్చారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్‌ బిల్లు రూ.155 వచ్చిందని రాజుబాబు కుటుంబానికి తెలిపారు. కాగా, ఎస్సీ రాయితీ ఉండడంతో రాజుబాబు బిల్లు చెల్లించాల్సిన అవసరంలేదని అధికారులు వివరించారు.

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

 గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటేహైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.97.76 విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98.27.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76లీటర్ డీజిల్ ధర రూ. 99.51

*  2వేల నోట్ల మార్పిడిపై పిల్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఐడీ ఫ్రూఫ్ లేకుండానే బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసుకునేందుకు RBI అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ అశ్వినీ ఉపాధ్యాయ అనే లాయర్ పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశ ఆర్థిక విధానాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం పలుసార్లు చెప్పిందని, అందువల్ల ఈ పిల్ను డిస్మిస్ చేయాలన్న RBI తరఫు లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

భారత మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌

హ్యుందాయ్‌ మోటార్స్ ఇండియా లిమిటెడ్‌ భారత మార్కెట్లోకి ఓ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ (Hyundai Exter)ని విడుదల చేసింది. దీని బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.5,99,900 కాగా.. టాప్‌ వేరియంట్‌ ధర రూ.9,31,990గా నిర్ణయించారు. హ్యుందాయ్‌ విక్రయించే ఎస్‌యూవీల విభాగంలో ఇదే అత్యంత చౌకైనది. ఇది మార్కెట్లో టాటా పంచ్‌, సిట్రాన్‌ సీ3, రెనో కిగెర్‌, నిస్సాన్‌ మాగ్నెట్‌తో పోటీపడుతుందని భావిస్తున్నారు. గ్రాండ్‌ ఐ10 నియోస్‌ను నిర్మించిన కె1 ప్లాట్‌ఫామ్‌ పైనే దీనిని తయారు చేశారు. ఇది ఈఎక్స్‌, ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌(ఓ), ఎస్‌ఎక్స్‌(ఓ) కనెక్ట్‌ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారుకు దాదాపు 11,000 బుకింగ్స్ వచ్చినట్టు హ్యుందాయ్‌ వెల్లడించింది. వీటిల్లో 38 శాతం ఆటో వేరియంట్‌కు, 20 శాతం సీఎన్‌జీ వేరియంట్‌కు లభించినట్లు పేర్కొంది.

ఫేక్ బిల్లులు ఇచ్చి జీఎస్టీ ఎగ్గొడితే

ఎవరైనా వ్యాపారులు వినియోగదారులకు నకిలీ బిల్లులు ఇచ్చి పన్ను ఎగవేస్తే ఇక నుంచి చిక్కుల్లో పడ్డట్లే. ఎందుకంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (GSTN)ని PMLA పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ED, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU)తో సమాచారాన్ని పంచుకోవాల్సిన ఎంటిటీల జాబితాలో GSTN చేర్చబడింది. ఇప్పుడు జీఎస్టీకి సంబంధించిన విషయాల్లో ఈడీ, ఎఫ్‌ఐయూ నేరుగా జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే GST ఎగవేత సంస్థ, వ్యాపారవేత్త లేదా ఇన్‌స్టిట్యూట్‌పై ప్రత్యక్ష చర్య తీసుకోవడానికి ED ముందుకు రావచ్చు. ఇది GST ఎగవేతకు సంబంధించిన కేసులలో EDకి చాలా సహాయం చేస్తుంది.