ScienceAndTech

గ్రహాంతర వ్యోమనౌక శకలాలను కనుగొన్నట్లు హార్వర్డ్ శాస్త్రవేత్త పేర్కొన్నారు

గ్రహాంతర వ్యోమనౌక శకలాలను కనుగొన్నట్లు హార్వర్డ్ శాస్త్రవేత్త పేర్కొన్నారు

హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త  డాక్ట‌ర్ అవీ లోబ్‌ ( Harvard University Professor Dr. Ave Loeb) తాను ఉల్కాపాతం నుండి గ్ర‌హాంత‌ర సాంకేతిక‌త‌ను కనుగొన్నట్లు చెప్పారు. గ్ర‌హాంత‌ర‌జీవుల‌ అన్వేషణలో తాము గణనీయమైన పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. పాపువా న్యూ గినియా తీరంలో 2014లో కూలిన ఉల్క నుండి గ్రహాంతర సాంకేతికతకు సాక్ష్యంగా ప‌రిగ‌ణిస్తున్న శ‌క‌లాల‌ను కనుగొన్నట్లు ప్రొఫెసర్ అవీ లోబ్ భావిస్తున్నారు.CBS న్యూస్ ప్రకారం, లోబ్‌, అతని బృందం ఆ శ‌క‌లాల విశ్లేషణకు హార్వర్డ్‌కు త‌ర‌లించింది. అమెరికా అంత‌రిక్ష సంస్థ  యుఎస్ స్పేస్ క‌మాండ్‌, ఈ ఉల్క (Meteor) దాదాపు 99.999%, వేరే సౌర వ్యవస్థ నుండి వచ్చిందని నిర్ధారించగలదని లోబ్ అనుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వం లోబ్‌కు ఉల్క ప‌డిన‌ట్లుగా భావిస్తున్న 10 కిలోమీట‌ర్ల‌ వ్యాసార్థం గ‌ల భూభాగాన్ని ప‌రిశోధ‌న‌ల కోసం కేటాయించింది.

“అక్కడే ఉల్క ప‌డింది.  ప్రభుత్వం దానిని ర‌క్ష‌ణ శాఖ ద్వారా గుర్తించింది. ఇది చాలా పెద్ద ప్రాంతం, బోస్టన్ న‌గ‌ర‌మంత ఉంటుంది”  అని లోబ్ చెప్పారు. అది భూమిని తాకిన‌ప్పుడు జ‌రిగిన పేలుడు తాలూకు కాంతి, శబ్దం, ఇత‌ర వివ‌రాల‌తో అది ఎక్క‌డ ప‌డిందో ఖ‌చ్చితంగా గుర్తించ‌గ‌లిగామ‌ని అయ‌న అన్నారు.

యుఎస్ఏ టుడే ప్రకారం, బృందం వెలికితీసిన శకలాలు బాస్కెట్‌బాల్ ప‌రిమాణంలో ఉన్న‌ ఉల్క (Interstellar meteor) నుండి 2014 లో భూవాతావరణంలోకి ప్ర‌వేశించి ప‌శ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోకి దూసుకెళ్లాయని భావిస్తున్నారు. మ‌న‌ సౌర వ్యవస్థ వెలుపల నుండి వ‌చ్చిన ఈ ఉల్కాపాతం సూర్యుని సమీపంలోని దాదాపు అన్ని నక్షత్రాల కంటే రెండు రెట్లు వేగంగా వ‌చ్చింద‌ని లోబ్ చెప్పారు.

“మేము పది చిన్న చిన్న‌ గోళాలను కనుగొన్నాము. ఇవి  అవి బంగారం, నీలం, గోధుమ రంగులలో దాదాపు గుండ్రంగా గోళీల్లా ఉన్నాయి. కొన్ని బుల్లి భూమిలా కూడా ఉన్నాయని లోబ్ ఉద్వేగంగా చెప్పారు.దాదాపు 50వ‌ర‌కూ ఉన్న ఇది మిల్లీమీట‌ర్ కంటే త‌క్కువ ప‌రిమాణం, మిల్లీగ్రాము కంటే త‌క్కువ బరువు క‌లిగిఉన్నాయ‌ని, అలాగే ఇవి త‌యారుచేయ‌బడ్డ ప‌దార్థానికి, మ‌న సౌర‌వ్య‌వ‌స్థ‌లో సాధార‌ణంగా క‌న‌బ‌డే ఏ ప‌దార్థంతో పోలిక లేద‌ని లోబ్ తెలియ‌జేసారు.ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం చూసిన అన్నిర‌కాల ఖ‌గోళ‌వ‌స్తువుల కంటే కూడా ఈ ఉల్క‌ చాలా ధృడంగా ఉంద‌ని, తాము సౌర‌వ్య‌వ‌స్థ ఆవ‌ల దాని వేగాన్ని కొల‌వ‌గ‌లిగామ‌ని, అది దాదాపు సెక‌నుకు 60 కి.మీల వేగంతో క‌దిలింద‌ని ఆయ‌న అన్నారు. ఇది మ‌న సూర్యుడి చుట్టుప‌క్క‌ల ఉండే ఏ న‌క్ష‌త్రం కంటే కూడా ఎక్కువ‌ని, అందువ‌ల్లనే ఈ ఉల్క వేరే సౌర‌వ్య‌వ‌స్థ‌లోని గ్ర‌హాంత‌రవాహ‌నం లేదా ఏదైనా సాంకేతిక ప‌రిక‌రం కావ‌చ్చ‌ని  లోబ్ అంటున్నారు. ప్ర‌స్తుతం లోబ్ వాటిని విశ్లేషించే ప‌నిలో ప‌డ్డారు. అవి ఒక‌వేళ స‌హ‌జ‌మైన‌వే అయితే, మ‌న సౌర‌వ్య‌వ‌స్థ ఆవ‌ల ఉన్న ప‌దార్థం గురించి తెలుస్తుంది. కృత్రిమ‌మైన‌వైతే ప్ర‌శ్న మ‌ళ్లీ మొద‌టికొస్తుంది.