Politics

సుప్రీంకోర్టులో అభిషేక్ బెనర్జీకి చుక్కెదురు

సుప్రీంకోర్టులో అభిషేక్ బెనర్జీకి చుక్కెదురు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ  సమీప బంధువు అభిషేక్ బెనర్జీ కి సుప్రీంకోర్టులో సోమవారం షాక్ తగిలింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  దర్యాప్తును ఆపడానికి కలకత్తా హైకోర్టు  తిరస్కరించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఆదేశాలపై ఆయన చేసిన అపీలును తోసిపుచ్చింది.టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పాత్రపై దర్యాప్తు జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)లకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చూస్తూ అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అపీలును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ, కుంభకోణంపై దర్యాప్తు చేసే హక్కు కేంద్ర దర్యాప్తు సంస్థకు ఉందని తెలిపింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చునని చెప్పింది.

అభిషేక్ పిటిషన్‌పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయంగా సున్నితమైన కేసులను తన ధర్మాసనం విచారించి, తీర్పులిస్తోందని అన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను వేరొక ధర్మాసనానికి అప్పగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఏప్రిల్ 28న ఆదేశించింది. దీంతో ఆయన పిటిషన్‌ను జస్టిస్ అమృత సిన్హా ధర్మాసనానికి అప్పగించారు. జస్టిస్ సిన్హా ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, మే 18న తోసిపుచ్చారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో అపీలు చేశారు.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రకారం వ్యక్తులపై దర్యాప్తు చేసే అధికారం తమకు ఉందని ఈడీ వాదించింది. విచారణకు హాజరుకావాలని అభిషేక్‌ను ఇటీవల ఆదేశించింది.ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ, మరికొందరు ఉన్నతాధికారులు ఇప్పటికే అరెస్టయ్యారు. 2014, 2021 సంవత్సరాల్లో ఈ కుంభకోణం జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో టీచర్లు, ఇతర ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి, అనేక మంది ఉద్యోగార్థుల నుంచి రూ.100 కోట్ల మేరకు వీరు వసూలు చేశారని చెప్తోంది. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తు చేస్తోంది.