NRI-NRT

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండగ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండగ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో జూలై 9,ఆదివారం సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఆనంద ఉత్సవాలతో 500 మందికి పైగా భక్తులతో కన్నుల పండగగా జరిగింది. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో , డప్పు వంటి వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో పరిసరాలు మారుమోగడంతో కార్యక్రమం హోరెత్తింది.

బోయిన స్వరూప,పెద్ది కవిత,కలకుంట్ల లావణ్య,వేముల సౌహన్య మొదలగు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి కి బోనాలు సమర్పించారు. విలువైన ఆధ్యాత్మిక , సాంప్రదాయ ప్రాముఖ్యతను కలిగిన ఈ పండగ నిష్ఠతో అత్యంత భక్తితో నిర్వహించబడింది. సింగపూర్ లో నివసించే అనేక మంది వారి కుటుంబ సమేతంగా పాల్గొనగా , అనేకమంది కార్మిక సోదరులు కూడా చురుకుగా పాల్గొన్నారు.

బోనం ఆ జగన్మాత కు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు తాము వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం కూడిన బోనాన్ని ముగ్గు , పసుపులతో అలంకరించిన కొత్త మట్టి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, పోతురాజులు, ఆటగాళ్ళు తోడ్కొని వెళ్లారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచి నిష్ఠగా బోనాల్ని సమర్పించారు. మహిళలు,పిల్లలు అందరూ ఎలాంటి భేజషం లేకుండా నృత్యాలు చేశారు. తరవాత అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని సేవించారు.

“పోతురాజు” యొక్క వేషధారణ,వారి ఆహార్యం,మనోహరమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచింది. ఎంతోమంది తెలుగు వారు తమ పిల్లలకి తెలుగు సాంప్ర దాయాన్ని,బోనాల విశిష్టతని చూపటానికి ప్రత్యేకంగా హాజరైనారు. సింగపూర్ లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ఉచిత బస్సుల్ని ఏర్పాటు చేశారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండగని,దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపడం పట్ల మరియు ఆయన బోనాల్ని సమర్పించిన మహిళల్ని, కమిటీ సభ్యుల్ని,కార్యక్రమ నిర్వాహకులు బోయిన సమ్మయ్యని అభినందించారు.

కార్యక్రమం సజావుగా జరిగేలా చూసేందుకు తమ విలువైన సహకారాన్ని అందించిన సభ్యులందరికీ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హాజరైన ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడంలో వారి కృషి మరియు అంకితభావం కీలక పాత్ర పోషించాయని తెలిపారు.సభ్యులందరూ బోనాల స్ఫూర్తిని పురస్కరించుకుని ఉత్సవాల్లో పాల్గొనడంతో ఈ కార్యక్రమం సింగపూర్ లోని తెలుగు వారి ఐక్యత మరియు సాంస్కృతిక గొప్పతనం అందరికీ చాటి చెప్పింది.