అమెరికా-చైనా మధ్య విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ఈ సారి వీరి గొడవకు దిల్లీ (Delhi) కేంద్రంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గంలో మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా.. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాతో భేటీ అయ్యారు. వీరి భేటీకి దిల్లీ వేదికైంది. దీంతో అమెరికా తీరుపై చైన్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.టిబెట్ సంబంధిత అంశాల పేరిట అమెరికా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని చైనా హెచ్చరించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి వాంగ్ షియావ్‌జియాన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘షిజాంగ్ (టిబెట్ చైనీస్ పేరు) మా దేశంలో అంతర్భాగమన్న దాని నిబద్ధతకు కట్టుబడి ఉండేందుకు అమెరికా గట్టి చర్యలు తీసుకోవాలి. షిజాంగ్ పేరిట చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలి. దలైలామా బృందం చేపట్టే చైనా వ్యతిరేక కార్యకలాపాలకు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.
‘‘షిజాంగ్ వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గతమైనవి. వీటిల్లో బాహ్యశక్తుల జోక్యానికి ఎటువంటి అర్హత లేదు. టిబెట్ స్వాతంత్ర్యం కోరుకొనే శక్తులు.. విదేశీ దౌత్యవేత్తల మధ్య ఎటువంటి సంబంధాలనైనా చైనా బలంగా వ్యతిరేకిస్తుంది’’ అని చైనా ప్రతినిధి తేల్చి చెప్పారు. అంతేకాదు.. అమెరికా ఉన్నతాధికారి ఉజ్రా జియాకు అక్కడి ప్రభుత్వం ‘టిబెట్ వ్యవహారాల సమన్వయకర్త’ హోదా ఇవ్వడం కూడా పూర్తిగా నేరపూరితమని పేర్కొన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, టిబెట్‌లో అభివృద్ధి, స్థిరత్వాన్ని తక్కువ చేసి చూపడానికి తీసుకొన్న చర్యగా అభివర్ణించారు. టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని పూర్తిగా వేర్పాటువాద రాజకీయ సంఘంగా చైనా ప్రతినిధి పేర్కొన్నారు. అది చైనా చట్టాలకు వ్యతిరేకమన్నారు. దానికి ప్రపంచంలో ఏ దేశం గుర్తింపు లభించలేదని తెలిపారు.అమెరికా మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా తన భారత పర్యటనలో భాగంగా న్యూదిల్లీలోని దలైలామాతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రవాస టిబెట్ ప్రభుత్వం కోసం పనిచేసే సెంట్రల్ టిబెటియన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఉజ్రా జియా జులై8 నుంచి 14వ తేదీ వరకు భారత్, బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె భారత్‌లోని ఉన్నతాధికారులను కూడా కలవనున్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట అమెరికా విదేశాంగ సహాయ మంత్రి డొనాల్డ్ లూ కూడా ఉన్నారు.