మంచు శివలింగం దర్శనం కోసం భక్తులు చేపట్టే అమర్‌నాథ్ యాత్ర పునః ప్రారంభమైంది. భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల క్రితం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఎడతెగని వర్షాల కారణంగా గత మూడు రోజుల నుంచి నిలిచిపోయిన అమర్‌నాథ్‌యాత్ర.. ఆదివారం పంజతరణి, శేష్‌నాగ్ శిబిరాల నుంచి ప్రారంభమైంది. అమర్‌నాథ్ గుహ దగ్గర వాతావరణం మెరుగుపడటంతో మందిర ద్వారాలను తెరిచి.. అక్కడ చిక్కుకుపోయిన భక్తులకు మంచు శివలింగాన్ని దర్శించే అవకాశం అధికారులు కల్పించారు. ఇప్పటికే దర్శనం చేసుకున్న భక్తులకు బల్టాల్ బేస్‌క్యాంప్‌నకు వెళ్లడానికి అనుమతించారు. అనంతనాగ్‌లోని కాజీగుండ్ శిబిరంలో 700 మందికిపైగా యాత్రికులకు సైన్యం ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వీరి యాత్ర నిలిచిపోయింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో కొత్తగా యాత్రికులను జమ్మూ నుంచి అనుమతించడంలేదు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్ పడిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. జమ్ము కశ్మీర్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల వల్ల అధికారులు యాత్రకు రావడం శ్రేయస్కరం కాదని చెప్పి.. మూడు రోజుల క్రితం జాతీయ రహదారులపై రాకపోకలను నిషిధించారు. ప్రస్తుతానికి పహాల్గామ్ మార్గంలో మాత్రమే రాకపోకలు మొదలయ్యాయి. బల్తాల్‌లో వర్షాలు కురుస్తున్నందున అక్కడ ఇంకా ప్రారంభించలేదు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 6 రోజుల పాటే భక్తుల దర్శనాలు జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 67,566 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. రక్షణ దళ సిబ్బంది కొండ చరియలు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి 62 రోజుల వార్షిక తీర్థయాత్ర జూలై 1న అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ , గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్ నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం డ్రోన్లు, మెటల్ డిటెక్టర్లు, ఇతర నిఘా పరికరాలు, ఆధునిక ఆయుధాలతో కూడిన సిబ్బందిని హైవేపై మరియు వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.