కడలి అడుగున పురాతన రహదారి బయటపడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు ఇటీవల అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. ఇటీవల సముద్రంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇది కొత్తరాతి యుగంలోని మంచుయుగం చివరి రోజులకు చెందినది కావచ్చని, కనీసం ఏడువేల ఏళ్ల కిందట దీనిని నిర్మించి ఉంటారని చెబుతున్నారు. సముద్ర గర్భానికి పదహారు అడుగుల లోతున దీనిని కనుగొన్నారు. జదార్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మేట్ పారికా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సముద్రంలో దాగి ఉన్న ఈ పురాతన రహదారిని కనుగొంది.ఈ రహదారిపై రాతి గొడ్డళ్లు, పలుగులను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి, ఇవి క్రీస్తుపూర్వం 4,900 నాటివని తేల్చారు. వీటిని ఉపయోగించి జంతు బలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ లభించాయి.