DailyDose

సిరియాలో అమెరికా డ్రోన్ దాడిలో ఐసిస్ నాయకుడు మృతి

సిరియాలో అమెరికా డ్రోన్ దాడిలో ఐసిస్ నాయకుడు మృతి

ఇస్లామిక్ నాయకుడు ఒసామా అల్ ముహజర్ ను ఎట్టకేలకు అమెరికా మట్టుపెట్టింది. ఈ విషయాన్ని అమెరికా సైన్యం ప్రకటించింది. సిరియాలో డ్రోన్ల సాయంతో ఉగ్రవాదిని హతమార్చినట్టు పేర్కొంది. తూర్పు సిరియాలో జరిగిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ నాయకుడు ఒసామా అల్ ముహజర్ హతమైనట్లు అమెరికా సైన్యం పేర్కొంది. శుక్రవారం (జూలై 7) జరిగిన దాడిలో ఐసిస్ నేత హతమైనట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఐసిస్ ను ఓడించేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) చీఫ్ జనరల్ మైఖేల్ కురిల్లా స్పష్టం చేశారు. ఐసిస్ ఈ ప్రాంతానికే కాకుండా యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని ఆయన అన్నారు.కాగా.. ఈ ఆపరేషన్ లో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అయితే పౌరులకు గాయాలయని వస్తున్న వార్తలను సంకీర్ణ దళాలు అంచనా వేస్తున్నాయని తెలిపింది. ఈ దాడికి ఉపయోగించిన డ్రోన్లను రష్యా యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో రష్యా విమానాలను తప్పించుకుంటూ అవే ఎంక్యూ-9ఎస్ డ్రోన్లు ఆపరేషన్ ను పూర్తి చేశాయని పేర్కొంది.

బుధవారం మూడు రష్యన్ విమానాలు అమెరికా డ్రోన్ల ముందు పారాచూట్ మంటలను జారవిడిచాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే వాటి నుంచి అవి తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పిది. దీనిని ఆపాలని మాస్కోను గ్రింకెవిచ్ కోరారు. యూఎస్ రీపర్ డ్రోన్లు, రష్యా విమానాలు బుధ, గురువారాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో పాల్గొన్నట్లు అమెరికా విడుదల చేసిన వీడియో ఫుటేజీలో పేర్కొంది.సున్నితమైన అమెరికా గూఢచర్యం సాంకేతిక పరిజ్ఞానంతో నిండి, నల్ల సముద్రంపై కార్యకలాపాలు సాగిస్తున్న 30 మిలియన్ డాలర్ల రీపర్ డ్రోన్ కూల్చివేతకు రష్యా జెట్లే కారణమని అమెరికా ఆరోపించడంతో ఈ ఏడాది ప్రారంభంలో దౌత్యపరమైన వివాదం చెలరేగింది. మార్చిలో నీటిలో కూలిన డ్రోన్ కు తమ జెట్లే కారణం కాదని మాస్కో పేర్కొన్నప్పటికీ.. డ్రోన్ మార్గాన్ని అడ్డుకోవడానికి రష్యా విమానాలు విన్యాసాలు చేస్తున్నట్లు యూఎస్ సైనిక వీడియోలో కనిపించిందని అల్ జజీరా తెలిపింది.