ఐకమత్యం.
ప్రజాస్వామ్యం.
సేవాభావం.
సాంప్రదాయం.
తానాలో ఇవే నా లక్ష్యాలు.
నూతన అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు.
❀⊱┄┄┄┄┄┄┄┄┄┄┄⊰❀ ❀⊱┄┄┄┄┄┄┄┄┄┄┄⊰❀ ❀⊱┄┄┄┄┄┄┄┄┄┄┄⊰❀
ఐకమత్యం ప్రజాస్వామ్యం సేవాభావం సాంప్రదయం అనే నాలుగు స్తంభాలపై తానాను ఆరోగ్యకరంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని 2023-25కు గాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నిరంజన్ శృంగవరపు అన్నారు. ఆదివారం నాడు ఫిలడెల్ఫియాలో జరిగిన 23వ తానా మహాసభల ముగింపు వేడుకల్లో ఆయన భారీ సంఖ్యలో హాజరయిన మద్దతుదారుల మధ్య పదవిని స్వీకరించి ప్రసంగించారు. కర్నూలు జిల్లాకు చెందిన మిషిగన్ ప్రవాసాంధ్రుడిని అయిన తాను ఐకమత్యమైన కూటమిలో సభ్యుడిగా, ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థిగా, సేవాభావం నిండిన కార్యకర్తగా, తెలుగు సంస్కృతి సాంప్రదయాలను ప్రేమించే సగటు ప్రవాసుడిగా మార్పు నినాదంతో గెలుపు తీర్పును అందుకున్నానని అన్నారు. తనకు అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వేదికపైన ఉన్న ప్రతి తానా కార్యవర్గ సభ్యుడు, వేదిక క్రిందనున్న తానా సభ్యులు, అభిమానులు, అతిథుల సహకారం అవసరమన్న ఆయన తనను ఆశీర్వదించవల్సిందిగా కోరారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా TNIతో ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడిన ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు.
డబ్బు కన్నా సమయం గొప్పది. లక్షల దాలర్లు విరాళం ఇచ్చిన వారిని గౌరవిస్తామని, కానీ దానికన్నా విలువైన సమాయాన్ని తానాకు వెచ్చించే వారికి ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవాన్ని ఇస్తామని నిరంజన్ తెలిపారు. పనిచేసే వారిని చిత్తశుద్ధిగా గుర్తించి వారికి సరైన రీతిలో సరైన సమయానికి పదవులు అందేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రచించామన్నారు. తానాను నడిపించే సమర్థ నాయకత్వ ఎంపికకు/ఎన్నికకు అడ్డం వచ్చే అన్ని అడ్డదారులను సాంకేతిక, సహేతుక వనరులు ఆసరాగా మూసివేస్తామన్నారు. తమ కూటమిలో ఇటీవల మార్పులు సంభవించినప్పటికీ తానా పట్ల తమ లక్ష్యశుద్ధిలో, ఆశయస్ఫూర్తిలో ఎలాంటి మార్పు లేదని నిరంజన్ ఉద్ఘాటించారు. అందరినీ కలుపుకుపోతామని, అందరినీ ఆదరిస్తామని ఆయన హామీనిచ్చారు. నదులన్నీ సముద్రంలో కలిసే మాదిరి తానాలో అన్నీ గ్రుపులు కూడా సేవ అనే సముద్రంలో కలిసిపోయి తమలోని అంతరాలను, అభ్యంతరాలను ప్రక్షాళన చేసుకుంటాయని తాను ఆశిస్తున్నానని అన్నారు. 2023 సంవత్సరం తానాలో పలు మార్పులకు సాక్షీభూతమైనప్పటికీ తాము ఆశించిన భాసించిన శ్వాసించిన మార్పులకు చాలా దూరం ఉందని, అవి సాకారం కావడానికి ఎంతో కృషి చేయవల్సిన అవసరం ఉందన్నారు. 2023 తానా చరిత్రలో ఎన్నికల ఏడాదిగా పడిన ముద్రను చెరిపేసి, కాలహరణం చేయకుండా సభ్యులకు ఆమోదయోగ్యమైన రాజీ ప్రక్రియ ద్వారా తదుపరి నాయకత్వాన్ని ఎన్నుకుంటామని, తద్వారా తానా లక్ష్యానికి న్యాయం చేసేందుకు కృషి చేసే సమైక్య వేదికను నిర్మించుకుంటామని అన్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన సభ్యులు ఐకమత్యంగా సేవ చేసి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసేలా చర్య తీసుకోవడమే తానాకు తాను వేసే అంజనమని నిరంజన్ తెలిపారు.