ఏలూరు వారాహి విజయయాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేస్తూ దుమ్మెత్తిపోశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. దేశమంతా వాలంటీర్ల వ్యవస్థను అభినందిస్తుందని..ఐక్యరాజ్యసమితి సైతం వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసించింది చెప్పుకొస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. వాలంటీర్లకు సిగ్గు శరం ఉంటే పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తుంది అనే పవన్ కల్యాణ్ ఆరోపణ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఎవరి మీద చేసిన ఆరోపణలకన్నింటికీ పరాకాష్ట.సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఈ విషయం మీద ఆధారాలుంటే యాక్షన్ తీసుకోకుండా పీకే చెవిలో ఎందుకు చెప్పారు ?’అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ‘ప్రజల కోసం పని చేసే వైసీపీ వాలంటీర్లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వలంటీర్లకి సిగ్గు , శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే వాళ్ళు పవన్ కల్యాణ్ మీద కేసులు పెట్టాలి. పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు ?’ అని ఆర్జీవీ ప్రశ్నించారు. నా ఊహలో పవన్ కల్యాణ్ ముందు ముందు సీఎం వైఎస్ జగన్‌పై చేసే ఆరోపణలు ఎలా ఉంటాయో కూడా ముందే ఊహించి ఆర్జీవీ ట్వీట్ చేశారు. 9/11అటాక్‌కి అల్ ఖైదాకి ఫండింగ్ చేసింది జగనే అని సీఐఏ వాళ్లు నా ఎడమ చెవిలో చెప్పారు.
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖస్సోగి హత్యలో జగన్ హస్తం లేదు కానీ ఖచ్చితంగా తన కాలుందని మా ఎదురింటి సుబ్బారావు చెప్పారు అంటూ పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ‘వాక్ స్వాతంత్ర్యం ఉన్నది అభిప్రాయాలు చెప్పడానికి, భిన్నాభిప్రాయాలతో చర్చా కార్యక్రమాలతో వాదించడానికి అని ఆర్జీవీ స్పష్టం చేశారు. కానీ నిరాధార (జీరో ఎవిడెన్స్) ఆరోపణలు చేయడానికి కాదని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్‌కు ఇది తెలియకపోవడం అతడి చదువులేనితనాన్ని నిరూపిస్తోంది’ అని విమర్శించారు. ఈ మేరకు ఏలూరు సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వీడియోను కూడా వర్మ ట్వీట్ చేశారు.ఇకపోతే రాష్ట్రంలో 17 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణమని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు వారాహి విజయయాత్ర బహిరంగ సభలో ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్లు… గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, అందులో అమ్మాయిలు ఎంతమంది, వారికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా, వితంతువులు ఎంతమంది, మగవాళ్లకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అనే వివరాలను సేకరిస్తారని, వలంటీర్ల ద్వారా ఆ వివరాలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళుతున్నట్టు కేంద్ర నిఘా పెద్దలు తనకు చెప్పారని పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు వివరించారు. దాంతో ఆ సంఘ వ్యతిరేక శక్తులు అమ్మాయిలను ట్రాప్ చేసి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలిసిందని పవన్ ఆరోపించారు.