శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే (Ranil Wickremesinghe) భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 21న భారత్‌కు వచ్చి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయనతో పాటు శ్రీలంక విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర్, విదేశాంగ మంత్రి అలీసాబ్రీ, మత్స్యశాఖ మంత్రి డాగ్లస్ దేవానంద కూడా భారత పర్యటనకు రానున్నారు.ఇక భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో (PM Modi) కూడా రణిల్ విక్రమ్‌సింఘే సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పెట్రోల్, విద్యుత్, వ్యవసాయం, నౌకాయానం తదితర రంగాల్లో భారత్ చేపట్టిన ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక రణిల్ విక్రమ సింఘే భారత పర్యటన నేపథ్యంలో.. వచ్చేవారం విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్ర శ్రీలంకలో పర్యటించనున్నారు. విక్రమసింఘే పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై ఆ దేశ అధికారులతో చర్చించనున్నారు.
ఇకపోతే గతేడాది శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడంతో ప్రజలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రణిల్ విక్రమ సింఘే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. రణిల్ విక్రమ సింఘే మొదటిసారి భారత పర్యటనకు వస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న క్రమంలో రణిల్ విక్రమసింఘే భారత పర్యటనకు రావడం ప్రధాన్యత సంతరించుకుంది.