ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా టీమ్ఇండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికా వేదికగా జూలై 12 నుంచి 16 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత పరుగుల యంత్రం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli)అత్యంత అరుదైన రికార్డును అందుకునే అవకాశం ఉంది. అయితే.. ఇదీ వెస్టిండీస్ తుది జట్టు కూర్పు పైనే ఆధారపడి ఉంది.స్వదేశంలో కాకుండా విదేశాల్లో ఒకే జట్టుకు చెందిన తండ్రీ, కొడుకుతో ప్రత్యర్థిగా ఆడడం. అవును ఇప్పటి వరకు దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఒక్కడే తన కెరీర్‌లో తండ్రి, కొడుకుతో ప్రత్యర్థిగా ఆడాడు. 1992 ఆసీస్ పర్యటలో జెఫ్ మార్ష్ కు ప్రత్యర్థిగా టెండూల్కర్ ఆడాడు. ఇది టెండూల్కర్‌కు ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు మ్యాచ్ కాగా.. జెఫ్ మార్ష్‌కు ఆఖరిది. అలాగే 2011/12లో ఆస్ట్రేలియాలో టీమ్ఇండియా పర్యటించింది. అప్పుడు జెఫ్ కుమారుడు షాన్ మార్ష్(Shaun Marsh) తుది జట్టులో ఉన్న ఆస్ట్రేలియాతోనూ సచిన్ ఆడాడు.
ఇప్పుడు ఇలాంటి అవకాశమే విరాట్ కోహ్లికి వచ్చింది. 2011లో భారత జట్టు విండీస్‌లో పర్యటించింది. అప్పుడు శివనారాయణ్ చంద్రపాల్ (Shivnarine Chanderpaul)భాగంగా ఉన్న విండీస్‌తో కోహ్లి తలపడ్డాడు. ఇప్పుడు అతడి కొడుకు తగ్‌నరైన్ చందర్ పాల్(Tagenarine Chanderpaul) కు ప్రత్యర్థిగా ఆడే అవకాశం ఉంది. అయితే.. అతడికి విండీస్ తుది జట్టులో చోటు దక్కితేనే అది సాధ్యం అవుతుంది. విండీస్ తుది జట్టులో టగ్ నరైన్ చంద్రపాల్ చోటు దక్కించుకుంటే సచిన్ తరువాత విదేశాల్లో తండ్రీ, కొడుకుతో ప్రత్యర్థిగా ఆడిన రెండో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలవనున్నాడు. వెస్టిండీస్ టెస్టు జట్టులో ఇప్పుడిప్పుడే టగ్ నరైన్ చంద్రపాల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాపై టెస్టుల్లో విండీస్ తరుపున అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 6 టెస్టుల్లో 45.30 సగటుతో 453 పరుగులు చేశాడు.