NRI-NRT

ఇవ్వాళా నుంచి నాటో శిఖరాగ్ర సమావేశం

ఇవ్వాళా నుంచి నాటో శిఖరాగ్ర సమావేశం

ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాతో పరోక్షంగా సాగుతున్న యుద్ధాన్ని కొత్తపుంతలెలా తొక్కించాలన్న అంశంపై చర్చించేందుకు అమెరికా సారథ్యంలోని నాటో కూటమి సమాయత్తమవుతోంది. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు లిథువేనియాలోని విల్నియస్‌లో కూటమి శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా 31 దేశాల అధినేతలు ఇందులో పాల్గొంటారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయంపైనే కాకుండా రక్షణ బడ్జెట్లను పెంచడంపై, రష్యా సరిహద్దుల్లోని నాటో సభ్యదేశాల భద్రతను పటిష్ఠం చేయడంపై ఇందులో చర్చించబోతున్నారు. ఉక్రెయిన్‌కు, స్వీడన్‌కు నాటోలో సభ్యత్వం ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉంది. ఇప్పటికే స్వీడన్‌కు సభ్యత్వానికి అంతా సిద్ధమైంది. టర్కీ ఒక్కటే అడ్డుపడుతోంది. అదీ మమ అంటే స్వీడన్‌ 32వ సభ్యదేశంగా నాటోలో చేరిపోయినట్లే. యూరోపియన్‌ యూనియన్‌లో చేరడానికి తమకు మద్దతిస్తే స్వీడన్‌ను నాటోలో చేరడానికి అంగీకరిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ మెలికపెట్టారు. ఉక్రెయిన్‌కు ఇప్పుడే సభ్యత్వం ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సభ్యత్వం ఇవ్వకుండా, యుద్ధంలో రష్యాతో నేరుగా తలపడకుండా బయటి నుంచి అన్నిరకాల మద్దతిస్తూ నడిపించాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.