ఆగస్టు 6వ తేదీన సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని సింగపూర్‌లోని ప్రవాస తెలుగు వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెకీలకు సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ పిలుపునిచ్చారు. మహాసభలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారం అందించేందుకు కృషి చేస్తానని సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ భరోసా ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందం నేడు కుమరన్‌తో సమావేశం జరిపింది.
ఈ సందర్భంగా తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు అందించేందుకు సింగపూర్‌లో అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్న విషయాన్ని బృందం వివరించింది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సత్తాను చాటి చెప్పనున్నారని పేర్కొంటూ, తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల కేవలం ప్రొఫెషనల్ నెట్‌వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కుతుందని వెల్లడించింది.
సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ తమ పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు, ఇండియాకు, సింగపూర్‌కు మధ్య అనుసంధానత కల్పించనుందని సంతోషం వ్యక్తం చేశారు.సింగపూర్‌లోని తెలుగు టెక్నోక్రాట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని భాగం చేస్తామని, సింగపూర్ ఐటీ మంత్రిని పాల్గొనేలా తాను సహకరిస్తామని హైకమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఫ్లయర్‌ను సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్, ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు రాకేష్, సింగపూర్ మండలి సభ్యులు కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.